
IPL 2021: ముంబయి లేకుంటే.. దిల్లీ, బెంగళూరుకు మంచి అవకాశం?
రోహిత్ సేనపై పాక్ మాజీ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో ముంబయి ఇండియన్స్ లేకపోతే కొత్త ఛాంపియన్లుగా అవతరించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ జట్లకు మంచి అవకాశమని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్ అన్నాడు. గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో మోర్గాన్ టీమ్ +0.587 నెట్ రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు ముంబయి ఇండియన్స్ ఈరోజు తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనున్న వేళ 171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే కోల్‌కతాను వెనక్కినెట్టి ముందడుగు వేసే అవకాశం ఉంది. కానీ అది జరగడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడా జట్టు -0.048 రన్‌రేట్‌తో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ఇలా స్పందించాడు. ‘ముంబయి ఇండియన్స్ డేంజర్ జట్టు. ప్లేఆఫ్స్ రేసు నుంచి అది తప్పుకోవడం మంచిదైంది. ఎందుకంటే ఆ జట్టు ఒక్కసారి గెలవడం ప్రారంభిస్తే ట్రోఫీ సాధించేవరకూ ఊరుకోదు. ఈ పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా దిల్లీ క్యాపిటల్స్ జట్లు కొత్త ఛాంపియన్‌గా అవతరిస్తే ఎలా ఉంటుంది’ అని సల్మాన్ తన ఆలోచనలు పంచుకున్నాడు.