
IPL 2021: దిల్లీ బ్యాట్స్‌మెన్ ఆటతీరు నిరాశ కలిగించింది: వీరేంద్ర సెహ్వాగ్
ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ బ్యాట్స్‌మెన్ ఆటతీరు నిరాశ కలిగించిందని, వాళ్ల షాట్ల సెలెక్షన్ బాగోలేదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విచారం వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి చెన్నైతో తలపడిన సందర్భంగా 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఆఖర్లో హెట్‌మయర్ (28) ధాటిగా ఆడి గెలిపించడంతో సరిపోయింది. లేదంటే ఓటమిపాలయ్యేది. అంతకుముందు ఓవర్‌లో కృష్ణప్ప గౌతమ్ హెట్‌మయర్ క్యాచ్ వదిలేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ దిల్లీ బ్యాట్స్‌మన్ ఆటతీరును ఎండగట్టాడు.
‘దిల్లీ జట్టులో చాలా మంది షాట్ల ఎంపిక నిరాశ కలిగించింది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు కోల్పోకుండా సరైన షాట్ల ఎంపికతో మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చు. కానీ, వీరి ఆటతీరు అస్సలు నచ్చలేదు. జట్టు యాజమాన్యం, కోచింగ్ సిబ్బంది ఆటగాళ్ల షాట్ల ఎంపికపై దృష్టిసారించాలి. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో బౌండరీలు బాదాల్సిన అవసరం లేదు. సింగిల్స్ తీస్తూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఒకవేళ దిల్లీ జట్టు ఛాంపియన్స్‌గా అవతరించాలంటే ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. ఇలాంటి తేలికపాటి మ్యాచ్‌లను అంత సంక్లిష్టంగా మార్చుకోవద్దు. పరిస్థితులు అనుకూలిస్తే ఇదే పిచ్‌పై వాళ్లు చెన్నైతో ఫైనల్స్‌లో తలపడొచ్చు. అలాంటప్పుడు ఇలా ఆడకూడదు. ఒకవేళ ముందు ఓవర్‌లో గౌతమ్.. హెట్‌మయర్ క్యాచ్ పట్టేసి ఉంటే మ్యాచ్ అక్కడితోనే అయిపోయేది’ అని సెహ్వాగ్ తన మనసులోని మాటలు చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.