
IPL 2021:మేం ఈ సారి కప్ గెలుస్తాం:రికీ పాంటింగ్
(Photo: Delhi Capitals Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ జట్టు విజేతగా నిలుస్తుందని దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం ఉన్న దిల్లీ జట్టుకి.. ప్రస్తుతం ఉన్న జట్టుకి వ్యత్యాసం ఉందని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో దూసుకుపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ఓటమిపాలైంది. ఫైనల్స్ ఉన్న మరో బెర్తు కోసం ఈ రోజు రాత్రి జరిగే క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడాడు.
‘నేను మూడేళ్లుగా దిల్లీ క్యాపిటల్స్‌తో ఉంటున్నా. మేం 2018లో చివరిస్థానంతో సరిపెట్టుకున్నాం. ఆ తర్వాత ఏడాది మూడో స్థానంలో నిలవగా, 2020లో రన్నరప్‌గా నిలిచాం. ఈ సారి కప్ గెలుస్తామని భావిస్తున్నా. రెండేళ్ల క్రితం ఉన్న జట్టుకి..ప్రస్తుతం ఉన్న జట్టుకి వ్యత్యాసం ఉంది. ఒక గొప్ప జట్టు ఎలా ఉంటుంది అంటే ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు కాకుండా మైదానంలో ఉన్న 11 మంది జట్టుకు ఏది అవసరమో అదే చేస్తారు’ అని పాంటింగ్ అన్నాడు.