
IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త హెడ్‌కోచ్
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ నియమితుడయ్యాడు. ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న మైక్ హెస్సన్ ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ అధికారికంగా వెల్లడించింది. ‘రానున్న ఐపీఎల్ సీజన్ (2022)కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌కోచ్‌గా సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మైక్ హెస్సన్ నుంచి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు’ అని ఆర్‌సీబీ పేర్కొంది.
ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంజయ్ బంగర్ మాట్లాడాడు. తొలి ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుచుకోవాలనే కలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పాడు. ‘ఇంత పెద్ద ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు ఒక పెద్ద అవకాశం. జట్టులోని అత్యంత అద్భుతమైన, ప్రతిభావంతులైన కొంతమంది సభ్యులతో కలిసి నేను పనిచేశాను. ఈ బృందాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చేయాల్సింది చాలా ఉంది. యాజమాన్యం, సహాయక సిబ్బంది కలిసితో మేం బాగా పనిచేసి అభిమానుల ముఖాల్లో నవ్వులు పూయిస్తాం’ అని బంగర్ పేర్కొన్నాడు. బంగర్ గత సీజన్‌లో ఆర్‌సీబీకి బ్యాటింగ్ సలహాదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇతడు భారత బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. 2014 నుంచి 2019 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నాడు. ఇక, వచ్చే సీజన్ నుంచి ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఐపీఎల్ ఆడినంతకాలం ఆర్‌సీబీకే ఆడుతానని కోహ్లీ వెల్లడించాడు.