Updated : 13 Feb 2022 08:31 IST

IPL 2022 Auction: తొలి రోజు వేలంలో ఆసక్తికర విషయాలివే!

అప్పుడు గొడవపడ్డ వాళ్లే..

‘‘అతడి వల్ల నా స్థైర్యం దెబ్బతింది. నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యా’’.. బరోడా కెప్టెన్‌ కృనాల్‌ పాండ్య గురించి ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా వ్యాఖ్యలివి. అప్పట్లో వీరి మధ్య గొడవ పెద్ద దుమారాన్ని లేపింది. ఇక జోస్‌ బట్లర్‌, అశ్విన్‌ మధ్య వైరం తెలిసిందే. ఇప్పుడు తమాషా ఏంటంటే ఐపీఎల్‌ వేలం పుణ్యమా అని ఈ శత్రువులు ఇప్పుడు జట్టు సహచరులుగా మారుతున్నారు. బట్లర్‌ ఇప్పటికే రాజస్థాన్‌ జట్టు సభ్యుడు కాగా.. శనివారం వేలంలో ఆ జట్టు అశ్విన్‌ను చేజిక్కించుకున్న వెంటనే ట్విట్టర్లో రసవత్తర చర్చ మొదలైంది. అశ్విన్‌ 2020 నుంచి 2021 వరకు దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. 2019లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన అశ్విన్‌.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బట్లర్‌ను మన్కడింగ్‌ చేయడంతో పెను వివాదం చెలరేగింది. ఇప్పుడు కొన్ని వారాల్లో వాళ్లు డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోనుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఇక హుడా, కృనాల్‌ విషయానికొస్తే నిరుడు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీకి ముందు వాళ్ల మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు వీళ్లిద్దరూ లఖ్‌నవూకు ఆడబోతున్నారు.


కుప్పకూలిన వేలం నిర్వాహకుడు..

బెంగళూరు: ఐపీఎల్‌ మెగా వేలంలో తొలిరోజు, శనివారం అనూహ్య సంఘటన జరిగింది. తొలి సెషన్లో రక్తపోటు తగ్గడంతో నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్‌ కుప్పకూలాడు. శ్రీలంక లెగ్‌స్పిన్నర్‌ హసరంగ పేరును పిలిచి ఫ్రాంఛైజీల స్పందన కోసం నిరీక్షిస్తున్నప్పుడు అతడు అనుకోకుండా వేదిక మీదే పడిపోయాడు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. 60 ఏళ్ల ఎడ్మీడ్స్‌కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. తర్వాత వెటరన్‌ క్రీడా వ్యాఖ్యాత చారుశర్మ వేలాన్ని నడిపించాడు.


మనవాళ్లకు మంచి ప్రాధాన్యత..

వేలంలో తెలుగు ఆటగాళ్లకు మంచి ప్రాధాన్యతే దక్కింది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు కోసం చెన్నై రూ.6.75 కోట్లు చెల్లించింది. కేఎస్‌ భరత్‌ను రూ.2 కోట్లకు దిల్లీ సొంతం చేసుకుంది. మరో ఆంధ్ర కుర్రాడు అశ్విన్‌ హెబ్బర్‌ కనీస ధర రూ.20 లక్షలకు దిల్లీ జట్టుతో చేరాడు. నెల్లూరుకు చెందిన 26 ఏళ్ల అశ్విన్‌ దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు.


వీళ్లకు షాకే..


బెంగళూరు: ఆటగాళ్లకు రూ.కోట్ల వర్షం కురిపించిన వేలం.. మరికొంత మందికి తీవ్ర నిరాశను మిగిల్చింది. కొంతమంది అగ్రశ్రేణి ఆటగాళ్లను కొనేందుకు తొలి రోజు ఫ్రాంఛైజీలు ముందుకు రాలేదు. ముఖ్యంగా ఐపీఎల్‌ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న సురేశ్‌ రైనా అమ్ముడుపోకపోవడం గమనార్హం. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో అడుగుపెట్టిన అతన్ని ఏ జట్టూ కొనలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్‌, ఆడమ్‌ జంపా, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌, భారత క్రికెటర్లు ఉమేశ్‌ యాదవ్‌, సాహాలకు కూడా నిరాశ తప్పలేదు. తాహిర్‌, ముజీబ్‌, ఆదిల్‌ రషీద్‌, మిల్లర్‌, మహమ్మద్‌ నబీ తదితరులపైనా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని