IPL 2022 Auction: అశ్విన్‌.. కంగారు పడకు ఈసారి క్రీజులోనే ఉన్నా: బట్లర్

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ సాదర స్వాగతం పలికాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో శనివారం అశ్విన్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది...

Published : 14 Feb 2022 01:07 IST

(Photo: Rajasthan Royals Twitter Video Screenshots)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ సాదర స్వాగతం పలికాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో శనివారం అశ్విన్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఆ జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాడు జోస్‌ బట్లర్‌.. అశ్విన్‌కు స్వాగతం పలికాడు. ఆ వీడియోను రాజస్థాన్‌ టీమ్‌ ట్విటర్‌లో పంచుకోవడంతో అది ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. అందులో బట్లర్‌ మాట్లాడుతూ.. ‘అశ్విన్‌ నేను బట్లర్‌ ఇక్కడ. నువ్వేం కంగారుపడకు. నేను ఈసారి క్రీజులోనే ఉన్నా. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున నిన్ను పింక్‌ జెర్సీలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. నీతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవాలని ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నాడు.

కాగా, 2019లో అశ్విన్‌ పంజాబ్‌ జట్టులో ఉండగా బట్లర్‌ ఇదే రాజస్థాన్‌ టీమ్‌లో ఉన్నాడు. అప్పుడొక మ్యాచ్‌లో బట్లర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. అప్పుడు యశ్‌ బంతి వేయకముందే ఈ రాజస్థాన్‌ బ్యాటర్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లడంతో మన్కడింగ్‌ చేశాడు. ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. క్రికెట్‌ ప్రేమికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం భిన్న స్వరాలు వినిపించారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు వాదించగా అశ్విన్‌ మాత్రం అది క్రికెట్‌ నిబంధనల్లో భాగమేనని సమర్థించుకున్నాడు. అతడికి పలువురు మాజీలు సైతం మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ ఒకే జట్టు తరఫున ఆడటం అభిమానులకు విశేషంగా మారింది. అశ్విన్‌ను రాజస్థాన్‌ కొనుగోలు చేయగానే నెటిజన్లు మీమ్స్‌తోనూ రెచ్చిపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని