IPL 2022 Auction: సురేశ్‌ రైనాకు బిగ్‌ షాక్‌.. తాహిర్‌, మిశ్రాలను పక్కన పెట్టేసిన ఫ్రాంచైజీలు

ఐపీఎల్‌ మెగా వేలంలో ఫ్రాంఛైజీలు పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా ఒకరు కాగా...

Updated : 12 Feb 2022 22:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ మెగా వేలంలో పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా ఒకరు కాగా, మరో ముగ్గురు స్టీవ్‌స్మిత్‌, షకిబ్‌ ఉల్‌ హసన్‌, డేవిడ్‌ మిల్లర్‌. ఐపీఎల్‌ టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ఉన్న రైనా గతేడాది చెన్నై తరఫున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అంతకుముందు వరకూ ఏటా ఆ జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా రాణించినా చెన్నై ఈ సారి అతడిని వదిలేసుకుంది. అయితే, మెగా వేలంలో మళ్లీ కొనుగోలు చేస్తుందని అభిమానులు భావించారు. అలాగే ఇతర జట్లు కూడా రైనా కోసం పోటీపడతాయని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ ఇటీవల ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతడిపైనా ఫ్రాంఛైజీలు ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ను సైతం ఎవరూ కొనుగోలు చేయలేదు. గతేడాది కోల్‌కతాలో ఆడిన అతడు పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు కూడా ఆసక్తి చూపలేదని అర్థమవుతోంది. అలాగే దక్షిణాఫ్రికా హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ సైతం గతేడాది రాజస్థాన్‌ జట్టులో విఫలమవడంతో ఈసారి ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌లో సీనియర్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ను ఈసారి ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అలానే అఫ్గాన్‌ కెప్టెన్, ఆల్‌రౌండర్ మహమ్మద్‌ నబీ, ఆసీస్‌ వికెట్ కీపర్‌ మ్యాథ్యూ వేడ్‌, టీమ్‌ఇండియా వెటరన్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహా, సామ్‌ బిల్లింగ్స్‌, ఉమేశ్‌ యాదవ్‌, అదిల్ రషీద్, ముజీబ్ జాద్రాన్, ఆడమ్‌ జంపా, అమిత్ మిశ్రా, రాజ్‌పత్‌ పాటిదార్, అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ను కొనుగోలు చేయలేదు. అదేవిధంగా యువ క్రీడాకారులు విష్ణు వినోద్, విష్ణు సోలంకీ, ఎన్‌ జగదీశన్‌, సిద్ధార్థ్‌, సందీప్‌పై ఎవరి దృష్టి పడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని