Published : 16 Feb 2022 11:11 IST

IPL 2022 Auction: ఈ ఆల్‌రౌండర్లకు ఎందుకంత డిమాండ్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఎంత ముఖ్యమో ఆల్‌రౌండర్లు కూడా అంతే ముఖ్యం. వీళ్లు కేవలం బ్యాటింగుకో లేదా బౌలింగుకో పరిమితం కాకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల నుంచైనా గట్టెక్కించాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి ఆటగాళ్లకు జాతీయ జట్లలోనే కాకుండా ఐపీఎల్‌లాంటి మెగా ఈవెంట్లలోనూ భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఇటీవల జరిగిన మెగా వేలంలోనూ అలాంటి ఆటగాళ్లు పెద్ద మొత్తానికే అమ్ముడుపోయారు. ఆ ఆటగాళ్లెవరు? వారి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? 

లివింగ్‌ స్టోన్‌: ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ గతేడాది జరిగిన ది హండ్రెడ్‌ లీగ్‌లో దంచికొట్టి ఫేమస్‌ అయ్యాడు. అక్కడ బంతిని స్టేడియం నలుమూలలా దంచి కొట్టడమే కాకుండా స్పిన్‌ బౌలింగ్‌తో వికెట్లు తీసి కూడా ఆకట్టుకున్నాడు. వీలైతే ఓపెనర్‌గా.. లేదంటే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎక్కడైనా హిట్టింగ్‌ చేయగల సత్తా ఉన్న బ్యాట్స్‌మన్‌. ఈ నేపథ్యంలోనే మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ.11.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

  • బ్యాటింగ్‌: 156 ఇన్నింగ్స్‌ల్లో 4,101 పరుగులు, 144.29 స్ట్రైక్‌రేట్‌, 2 శతకాలు, 23 అర్ధ శతకాలు
  • బౌలింగ్‌: 70 ఇన్నింగ్స్‌ల్లో 68 వికెట్లు, ఎకానమీ 7.86, అత్యుత్తమ ప్రదర్శన 4/17

శార్దూల్‌ ఠాకూర్‌: శార్దూల్‌ ఠాకూర్‌ గురించి అందరికీ తెలిసిందే. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఇటు టీమ్‌ఇండియా.. రెండు జట్లకూ పేస్‌ ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే పలు కీలక మ్యాచ్‌ల్లో రాణించి ఆయా జట్లను గెలిపించాడు కూడా. అయితే, శార్దూల్‌కు మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చి పలు వికెట్లు తీసిపెట్టడం వెన్నతో పెట్టిన విద్య. మరోవైపు అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జట్టును ఆదుకునే ఆటగాడు. అందువల్లే మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.

  • బౌలింగ్‌: 122 ఇన్నింగ్స్‌ల్లో 145 వికెట్లు, 8.57 ఎకానమీ, అత్యుత్తమ ప్రదర్శన 4/27.
  • బ్యాటింగ్‌: 35 ఇన్నింగ్స్‌ల్లో 183 పరుగులు, 112.96 స్ట్రైక్‌రేట్‌ 

హర్షల్‌ పటేల్‌: గతేడాది ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరడంలో హర్షల్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించాడు. అతడు మొత్తం 32 వికెట్లు తీసి ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో ఇన్ని వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో 2021 టోర్నీలో పర్పుల్‌ క్యాప్‌ రావడమే కాకుండా మంచి పేసర్‌గా గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితా నుంచి వదిలేసిన ఆర్సీబీ చివరికి వేలంలోనే రూ.10.75 కోట్లకు మళ్లీ దక్కించుకుంది.

  • బ్యాటింగ్: 74 ఇన్నింగ్స్‌ల్లో 949 పరుగులు, 150.39 స్ట్రైక్‌రేట్‌, 3 అర్ధ శతకాలు.
  • బౌలింగ్‌: 116 ఇన్నింగ్స్‌ల్లో 142 వికెట్లు, ఎకానమీ 7.95, అత్యుత్తమ ప్రదర్శన 5/27

వానిండు హసరంగ: ఈ శ్రీలంక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాడు. గతేడాది టీమ్‌ఇండియాతో ఆడిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో గతేడాది యూఏఈ లీగ్‌లో ఆర్సీబీ తరఫున ఆడి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న అదే జట్టు వేలంలో రూ.10.75 కోట్ల పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది.

  • బ్యాటింగ్‌ : 69 ఇన్నింగ్స్‌ల్లో 1,005 పరుగులు, 136.73 స్ట్రైక్‌రేట్‌, 3 అర్ధశతకాలు
  • బౌలింగ్‌: 80 ఇన్నింగ్స్‌ల్లో 115 వికెట్లు, ఎకానమీ 6.46, అత్యుత్తమ ప్రదర్శన 5/26.

రాహుల్‌ తెవాతియా: ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన రాహుల్‌ తెవాతియా పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. 31 బంతుల్లో 53 పరుగులు చేయడమే కాకుండా ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాదిన ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. మరోవైపు, స్పిన్‌ బౌలింగ్‌తోనూ రాణించి వికెట్లు పడగొట్టడం ఈ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ టైటాన్స్‌ మెగా వేలంలో రూ.9 కోట్లకు దక్కించుకుంది.

  • బ్యాటింగ్‌: 67 ఇన్నింగ్స్‌ల్లో  1,170 పరుగులు, 142.33 స్ట్రైక్‌రేట్‌, 2 అర్ధ శతకాలు
  • బౌలింగ్‌: 75 ఇన్నింగ్స్‌ల్లో 54 వికెట్లు, ఎకానమీ 7.42. అత్యుత్తమ గణాంకాలు 3/18
Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని