IPL 2022: ఆ విషయం అడిగేసరికి.. సస్పెన్స్‌ అని చెప్పిన హార్దిక్‌ పాండ్య

రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీలో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేస్తాడా లేదా అనేదానిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై స్పష్టతనివ్వాలని అడిగినా...

Updated : 14 Mar 2022 20:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీలో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేస్తాడా? లేదా? అనేదానిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై స్పష్టతనివ్వాలని అడిగినా అతడు నోరు విప్పలేదు. అది సస్పెన్స్‌గానే ఉంటుందని సమాధానమిచ్చాడు. ఈ ఏడాది గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త ఫ్రాంఛైజీగా ఐపీఎల్‌లో అడుగుపెట్టగా.. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నూతన జెర్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హార్దిక్‌ మాట్లాడుతూ తన కెప్టెన్సీ, బౌలింగ్‌పై స్పందించాడు.

‘కెప్టెన్సీ అనేది ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకుంటామనేదానిపై ఆధారపడి ఉంటుంది. జట్టు విజయాలు సాధిస్తే అది వాళ్ల ఘనత. ఓటములు ఎదురైతే నా బాధ్యత. వీలైనంత మేర మా ఆటగాళ్లను సంతోషంగా ఉంచడమే నా ప్రధాన కర్తవ్యం. అలాగే జట్టులో ఒక స్పష్టత, నిజాయతీ కూడా ఉండాలి. జట్టు విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నంతకాలం ఏ ఆటగాడికీ ఇతరుల సపోర్ట్‌ అవసరం ఉండదు. కానీ, కాలం పరీక్ష పెట్టినప్పుడు మేం కచ్చితంగా వారికి అండగా ఉంటాం. వారికి భరోసా కల్పిస్తాం. అలాగే మేం ఆటగాళ్లకు ఇంట్లో ఉన్నామనే భావన కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గుజరాత్‌ టైటాన్స్‌ అంటే వారికి సొంత జట్టు అనే నమ్మకం కలిగేలా చూడాలనుకుంటున్నాం’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

కాగా, హార్దిక్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ అనంతరం వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ పెద్దగా బౌలింగ్‌ చేయలేదు. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లోనూ   ముంబయి తరఫున అతడు బౌలింగ్‌ చేయలేదు. ఈ క్రమంలోనే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అవకాశం వచ్చినా రాణించలేదు. తర్వాత జట్టుకు దూరమై.. నేరుగా ఐపీఎల్‌లోనే ఆడనున్నాడు. దీంతో ఈ మెగా ఈవెంట్‌లోనైనా బౌలింగ్‌ చేస్తాడా.. లేదా అనేది ఆసక్తిగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని