IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌కి షాకిచ్చిన జేసన్‌ రాయ్‌.. ఇలా చేయడం రెండోసారి..!

ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు షాకిచ్చాడు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీ నుంచి అతడు తప్పుకొంటున్నట్లు సమాచారం...

Published : 01 Mar 2022 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు షాకిచ్చాడు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీ నుంచి అతడు తప్పుకొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు గతవారమే ఆ ఫ్రాంఛైజీకి విషయం చెప్పాడని తెలిసింది. అయితే, అతడి స్థానంలో ఇంకా ఆ జట్టు మరెవరినీ ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం. ఇక గతనెల జరిగిన మెగా వేలంలో గుజరాత్‌ యాజమాన్యం అతడిని కనీస ధర రూ.2కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే మెగా టోర్నీలో రాయ్‌ ఆ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అంతా భావించారు. కానీ, ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్‌లో అంతకాలం బయోబబుల్‌లో గడపడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, జేసన్‌ రాయ్‌ ఐపీఎల్‌లో ఇలా చేయడం ఇది రెండోసారి. 2020 సీజన్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌ వేలంలో రూ.1.5 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. అయితే, తర్వాత అతడు వ్యక్తిగత కారణాలతో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక రాయ్‌.. 2017లో గుజరాత్‌ లైయన్స్‌, 2018లో దిల్లీ డేర్‌డెవిల్స్‌, 2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల తరఫున ఆడిన సంగతి తెలిసిందే. కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు ఇటీవలే ముగిసిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఈ ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ 50.50 సగటుతో 303 పరుగులు చేసి అదరగొట్టాడు. అందులో ఒక శతకంతో పాటు రెండు అర్ధ శతకాలు సాధించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని