IPL 2022: ఐపీఎల్‌ టోర్నీలోకి ఆరోన్‌ ఫించ్‌.. సొంతం చేసుకున్న కోల్‌కతా టీమ్‌

కొద్దిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్‌ 2022 వేలంలో ఎవరూ ఆసక్తి చూపని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్‌ ఫించ్‌కు మళ్లీ ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం వచ్చింది...

Updated : 14 Mar 2022 20:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్‌ 2022 వేలంలో ఎవరూ ఆసక్తి చూపని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్‌ ఫించ్‌కు మళ్లీ ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం వచ్చింది. ఆ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేసిన ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ దీర్ఘకాలం బయోబుల్‌లో ఉండాల్సి రావడంతో ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో అతడి స్థానంలో ఫించ్‌ను కొనుగోలు చేసినట్లు కోల్‌కతా టీమ్‌ తాజాగా వెల్లడించింది. అతడిని కనీస ధర రూ.1.5 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక 2020 ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన ఆరోన్‌ ఫించ్‌ మొత్తం 12 మ్యాచ్‌ల్లో 268 పరుగులు చేశాడు. ఆపై గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు తొలి పొట్టి కప్పును అందించాడు. అయినా, ఫించ్‌ను కొనుగోలు చేసేందుకు వేలంలో జట్లు ఆసక్తి చూపలేదు. దీంతో ఐపీఎల్‌లో అతడు మళ్లీ కనపడే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అనూహ్యంగా ఈ ఆసీస్‌ సారథి కోల్‌కతా జట్టులో ఆడనున్నాడు. మరోవైపు ఫించ్‌ ఐపీఎల్‌లో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 2 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇక ఈనెల 26 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌లో కోల్‌కతా తొలి మ్యాచ్‌లోనే చెన్నైతో తలపడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని