IPL 2022: ఇక రాబోయేది ఐపీఎల్‌ టోర్నీనే.. నిబంధనల్లో కొత్త మార్పులు!

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకొని పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటుతో, బంతితో రాణించిన రోహిత్‌ జట్టు.. తొలి టెస్టు మాదిరే రెండో టెస్టును...

Updated : 15 Mar 2022 15:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకొని పూర్తి ఆధిపత్యం చలాయించింది. బ్యాటుతో, బంతితో రాణించిన రోహిత్‌ జట్టు.. తొలి టెస్టు మాదిరే రెండో టెస్టును కూడా మూడు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఈ సీజన్‌లో టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌లు మొత్తం పూర్తయ్యాయి. ఇక భారత జట్టు జూన్‌, జులైలోనే తర్వాతి మ్యాచ్‌లు ఆడనుంది. ఆలోపు ఆటగాళ్లంతా మండు వేసవిలో పసందైన వినోదం అందించేందుకు ఐపీఎల్‌-15వ సీజన్‌ ఆడనున్నారు.

అయితే, ఈసారి ఐపీఎల్‌ నిబంధనల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు బీసీసీఐ కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..

  1. ఏదైనా జట్టు మ్యాచ్‌కు ముందు కరోనా బారినపడితే.. ఆరోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయాలనేదానిపైనే కచ్చితమైన ప్రణాళిక రూపొందించారని తెలిసింది. కాగా, ఇదివరకు అలాంటి పరిస్థితుల్లో ఆరోజు జరగాల్సిన మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసేవారు. ఇప్పుడు కూడా అలా రీషెడ్యూల్ చేసేందుకే చూస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్‌ టెక్నికల్‌ టీమ్‌ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయమే అంతిమం.
  2. ఇక రెండో మార్పు.. ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు రివ్యూలు కోరే అవకాశం. ఇంతకుముందు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. దీంతో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండేసి రివ్యూలు ఉపయోగించుకోవచ్చు.
  3. మరోవైపు ఇటీవల మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధన.. ఎవరైనా బ్యాట్స్‌మన్‌ క్యాచ్‌ ఔటైన సందర్భాల్లో.. క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్‌ చేయాలనే కొత్త నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దాన్ని ఈ సీజన్‌లోనే అమలు చేయాలనుకుంటున్నారు.
  4. ఇక ప్లేఆఫ్స్‌ లేదా ఫైనల్‌ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్‌ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారని ఆ అధికారి చెప్పారు.

* అయితే ఈ కొత్త నిబంధనలపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని