Mumbai Indians: ముంబయి ఇండియన్స్‌ మళ్లీ వీళ్లను తీసుకుంటుందా?

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. టోర్నీ ఆరంభించిన ఐదేళ్ల వరకు తొలి కప్పును ముద్దాడని ఆ జట్టు తర్వాత ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచి నంబర్‌వన్‌గా ఎదిగింది...

Updated : 08 Feb 2022 15:22 IST

రిటెన్షన్‌లో వదులుకున్న కీలక ఆటగాళ్లు ఎవరంటే..

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. టోర్నీ ఆరంభించిన ఐదేళ్ల వరకు తొలి కప్పును ముద్దాడని ఆ జట్టు తర్వాత ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచి నంబర్‌వన్‌గా ఎదిగింది. అందుకు ప్రధాన కారణం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒకటైతే, ఆటగాళ్లపై ఆ జట్టుకుండే నమ్మకం మరొకటి. దీంతో ఏ క్రికెటరైనా ముంబయి టీమ్‌లో కచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. కాగా, రాబోయే సీజన్‌లో మెగావేలం (ఈ నెల 12, 13వ తేదీలు) నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఆ ఫ్రాంఛైజీ పలువురు కీలక ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. అయితే, మెగా వేలంలో మళ్లీ వారిని తీసుకునే వీలుంది. అందులో ఎవరున్నారు.. వారి విశేషాలేంటో ఓసారి పరిశీలిద్దాం.

ఇషాన్‌ కిషన్‌: ముంబయి ఇండియన్స్‌ చివరిసారి విజేతగా నిలిచింది 2020 ఐపీఎల్‌ 13వ సీజన్‌లో. అప్పుడు యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ (516) పరుగులతో నిలకడగా రాణించాడు. కానీ, అతడు గతేడాది పెద్దగా మెరవలేదు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 26.77 సగటుతో 241 పరుగులు చేశాడు. మరోవైపు ఈ ఏడాది మెగా వేలానికి ముందు రిటెన్షన్‌లో ముంబయి టీమ్‌.. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు సూర్యకుమార్‌‌, ఆల్‌రౌండర్‌ పొలార్డ్‌, ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాలను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇషాన్‌ను వదిలేసుకోవాల్సి వచ్చింది. అయితే, అతడి వయసు, బ్యాటింగ్‌ టాలెంట్‌, వికెట్‌ కీపింగ్‌ సామర్థ్యం ఇలా ఏ విభాగంలో చూసినా కచ్చితంగా ఏ జట్టు అయినా తీసుకోవాలని చూస్తుంది. దీంతో ముంబయి కూడా ఈ యువ ఓపెనర్‌ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌ వేలం జాబితాలో నాలుగో సెట్‌లో ఉండటం గమనార్హం.

క్వింటన్‌ డికాక్‌: ఇషాన్‌ కిషన్‌ లాగే క్వింటన్‌ డికాక్‌ సైతం 2020లో ముంబయి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా 35.92 సగటుతో 503 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు ఐదోసారి టైటిల్‌ సాధించడంలో తనవంతు కృషి చేశాడు. కానీ గతేడాది ఆశించినంత మేర రాణించలేదు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 29.70 సగటుతో 297 పరుగులు చేశాడు. దీంతో ముంబయి టీమ్‌.. ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను సైతం వదులుకోవాల్సి వచ్చింది. అయితే, అతడికున్న అనుభవం, బ్యాటింగ్‌ ట్రాక్‌ ప్రకారం.. ముంబయి త్వరలో జరగబోయే మెగా వేలంలో మరోసారి కొనుగోలు కొనుగోలు చేసే వీలుంది. మరోవైపు డికాక్‌ ఐపీఎల్‌ మెగా వేలం తొలి సెట్‌లో ఉండటం గమనార్హం. దీంతో అతడి కోసం ఇతర జట్లూ పోటీపడొచ్చు.

ట్రెంట్‌ బౌల్ట్‌: బ్యాట్స్‌మెన్‌ను మినహాయిస్తే ముంబయి ప్రధానంగా దృష్టి సారించేది బౌలింగ్‌ విభాగం పైనే. ఇప్పటికే ఆ జట్టు టీమ్‌ఇండియా పేస్‌ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రాను అట్టిపెట్టుకోవడంతో ఇక రెండో పేసర్‌ కోసం కచ్చితంగా ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ జట్టు యాజమాన్యానికి ముందు కనిపిస్తున్న ఆప్షన్‌ న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌. 2020లో ఈ పేస్‌ బౌలర్‌ కూడా ఇషాన్‌, డికాక్‌లాగే ముంబయి విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆ సీజన్‌లో 7.97 ఎకానమీతో బౌలింగ్‌ చేసిన అతడు 25 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. అయితే, గతేడాది మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 13 వికెట్లే తీసి నిరాశపరిచాడు. కాగా బౌల్ట్‌ ప్రపంచస్థాయి పేసర్ కావడంతో ముంబయి మళ్లీ తీసుకునే ఆలోచన చేస్తుండొచ్చు.

కృనాల్‌ లేదా చాహర్‌: ఇక ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ విభాగంలో కృనాల్‌ పాండ్య కీలక ఆటగాడు. తన సోదరుడు హార్దిక్‌ పాండ్య పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఇన్ని రోజులూ ఆ జట్టుకు సేవలందించగా కృనాల్‌ స్పిన్ ఆల్‌రౌండర్‌గా మెరిశాడు. అయితే, గత రెండేళ్లుగా ఈ సోదరులిద్దరూ అనుకున్నంత మేర రాణించకపోవడం లేదు. ఈ క్రమంలోనే ముంబయి పాండ్య సోదరులను వదిలేసింది. కాగా, ఈ ఏడాది కొత్తగా వచ్చిన అహ్మదాబాద్‌ టైటాన్స్ హార్దిక్‌ను సొంతం చేసుకుంది. కృనాల్‌ మాత్రం వేలంలో పాల్గొంటున్నాడు. దీంతో అతడిని కూడా ముంబయి స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా కొనుగోలు చేసే వీలుంది. మరోవైపు రాహుల్‌ చాహర్‌ గతేడాది భారత్‌లో జరిగిన ఐపీఎల్‌లో అద్భుతంగా మెరిశాడు. తొలి దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయగా తర్వాత యూఏఈలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 2 వికెట్లే తీశాడు. దీంతో ముంబయి ఈసారి చాహర్‌ను తక్కువ ధరకు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని