IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌.. అందరూ ఊహించిన ఆటగాడే..

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీలో అందరూ ఊహించినట్టే పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ట్వీట్‌...

Published : 28 Feb 2022 12:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీలో అందరూ ఊహించినట్టే పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ట్వీట్‌ చేసి ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించింది. 2008 ఆరంభ సీజన్‌ నుంచీ ఈ జట్టు ఐపీఎల్‌ టోర్నీలో ఆడుతున్నా.. ఇప్పటివరకు ట్రోఫీ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఎంత మంది కెప్టెన్లను మార్చినా పంజాబ్‌ తలరాత మాత్రం మారలేదు.

అయితే, గత రెండేళ్లు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌ ఈసారి కొత్త ఫ్రాంఛైజీ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు సారథిగా వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలు ఇప్పుడు మయాంక్‌ చేతికి అందాయి. కాగా, వీరిద్దరూ గత రెండేళ్లు పంజాబ్‌ తరఫున అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు అందించడం గమనార్హం. ఈ క్రమంలోనే జట్టు యాజమాన్యం మయాంక్‌కు తొలిసారి జట్టు పగ్గాలు అప్పగించింది. ఇక ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్సీ అందుకున్న అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నాడు. అలాగే తాను గర్వంగానూ ఫీల్‌ అవుతున్నట్లు చెప్పాడు. మరోవైపు ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే ఆకాంక్ష వెలిబుచ్చాడు. కాగా, ఐపీఎల్‌ 2022కు సంబంధించిన రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితాలో పంజాబ్‌ కేవలం ఇద్దర్ని మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో ఒకరు మయాంక్‌ ఉండగా మరొకరు యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఉన్నాడు.

ఇక మిగిలిన 23 మందిని ఇటీవల నిర్వహించిన మెగా వేలంలో పంజాబ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో లాంటి ఆటగాళ్లను తీసుకోవడంతో కెప్టెన్సీ రేసులో వీరూ ఉంటారని భావించారు. కానీ, జట్టు యాజమాన్యం మయాంక్‌పైనే నమ్మకం ఉంచింది. దీంతో అతడికే పగ్గాలు అందజేసింది. ఈ విషయంపై స్పందించిన పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే.. మయాంక్‌ 2018 నుంచీ తమ జట్టులో అంతర్భాగమని చెప్పాడు. అతడు గడిచిన రెండేళ్లలో కెప్టెన్సీ వ్యవహారాల్లోనూ పాలుపంచుకున్నాడని తెలిపాడు. ఇక తాము ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ప్రతిభావంతులైన యువకులతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. దీంతో మయాంక్‌ సారథ్యంలో భవిష్యత్‌లో జట్టును మరింత బలోపేతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. మయాంక్‌కు కెప్టెన్సీ చేపట్టే అన్ని అర్హతలూ ఉన్నాయని, అతడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని కుంబ్లే పేర్కొన్నాడు.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..

శిఖర్‌ ధావన్‌ (రూ.8.25 కోట్లు)

కగీసో రబాడ (రూ.9.25 కోట్లు)

జానీ బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు)

రాహుల్‌ చాహర్‌ (రూ.5.25 కోట్లు)

హర్‌ప్రీత్‌ బ్రార్‌ (రూ.3.8 కోట్లు)

షారుఖ్‌ ఖాన్‌ (రూ.9 కోట్లు)

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ ‌(రూ.60 లక్షలు)

జితేశ్‌ శర్మ(రూ.20 లక్షలు)

ఇషాన్‌ పోరెల్‌ (రూ.3.8 కోట్లు)

లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (రూ.11.5 కోట్లు)

ఓడియన్‌ స్మిత్‌ (రూ.6 కోట్లు)

సందీప్‌ శర్మ (రూ.90 లక్షలు)

రాజ్‌ అంగడ్‌ బవా (రూ.2 కోట్లు)

రిషి ధావన్‌ (రూ.55 లక్షలు)

ప్రేరక్‌ మన్కడ్‌ (రూ.20 లక్షలు)

వైభవ్ అరోరా (రూ.2 కోట్లు)

రితిక్‌ ఛటర్జీ (రూ.20 లక్షలు)

బాల్‌తేజ్‌ ధండా (రూ.20లక్షలు)

అన్ష్‌ పటేల్‌ (రూ.20 లక్షలు)

నాథన్‌ ఎలీస్‌ (రూ.75 లక్షలు)

అథర్వ తైడే (రూ.20 లక్షలు)

భానుక రాజపక్స (రూ.50 లక్షలు)

బెన్నీ హోవెల్‌ (రూ.40 లక్షలు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని