IPL 2022: ఐపీఎల్‌ 2022 నిర్వహణపై బీసీసీఐ ప్లాన్‌-బి ఇదేనా..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2022 సీజన్‌ పోటీలు ఎక్కడ జరుగుతాయనే..

Published : 14 Jan 2022 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2022 సీజన్‌ పోటీలు ఎక్కడ జరుగుతాయనే దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌ వెలుపలే ఈ మెగా టోర్నీని నిర్వహించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని, కొవిడ్ వ్యాప్తిని నిరంతరం గమనిస్తుంటామని ఇప్పటికే ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తాజాగా కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.  బీసీసీఐ ప్లాన్‌ బి ప్రకారం.. ఐపీఎల్ 15వ సీజన్‌ పోటీలు దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకకు తరలిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తొలుత ఒమిక్రాన్‌ కేసులు భారీగా వచ్చిన దక్షిణాఫ్రికాలో తగ్గుముఖం పట్టడంతో బీసీసీఐ వర్గాలు అక్కడ ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు టెస్టు సిరీస్‌ ఆడుతుండగా.. ఈ నెలలోనే వన్డే సిరీస్‌లోనూ తలపడతాయి. 2009లోనే దక్షిణాఫ్రికాలో పూర్తిస్థాయి ఐపీఎల్‌ జరిగింది. గత ఐపీఎల్‌ (2021) రెండో దశ పోటీలు యూఏఈ వేదికగా జరిగాయి. ‘‘మేం కేవలం యూఏఈ మీదనే ఆధారపడబోం. అందుకే మరిన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. దక్షిణాఫ్రికాలోని పరిస్థితులు మన ఆటగాళ్లకు చక్కగా సరిపోతాయి. లేకపోతే శ్రీలంకలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి’’ అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. 15వ సీజన్‌లో మొత్తం పది జట్లు తలపడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని