Published : 05 Feb 2022 02:30 IST

IPL 2022: ఆసక్తిగా ఆర్సీబీ కెప్టెన్‌ రేసు.. ఎవరెవరు ఉన్నారంటే..?

మరికొద్ది రోజుల్లో మెగా వేలం..

(Photo: RCB Twitter)

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి పోటీపడుతున్నా ఒక్కసారీ కప్పు సాధించలేదు. ఏటా ఎన్ని ప్రయోగాలు చేసినా రిక్త హస్తాలతోనే తిరిగొస్తోంది. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఎంత కష్టపడినా టైటిల్‌ నెగ్గలేక ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడు ఇప్పుడు ఆ జట్టులోనే కొనసాగుతున్నా ఆ ఫ్రాంఛైజీ మాత్రం వేరే సారథిని నియమించుకోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవర్ని నియమించనున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయ్యో విరాట్‌ ఎంత కష్టపడ్డావ్‌..

విరాట్‌ కోహ్లీని బెంగళూరు జట్టు 2008లోనే కొనుగోలు చేసింది. దీంతో అప్పటి నుంచి అతడు ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో మరే ఇతర ఆటగాడు కూడా ఇలా ఒక్క జట్టుతోనే కొనసాగింది లేదు. ఈ క్రమంలోనే 2014లో ఆ జట్టు పగ్గాలు స్వీకరించి గతేడాది దాకా సారథిగా కొనసాగాడు. అయితే, ఇన్నేళ్లు కెప్టెన్సీ చేసినా విరాట్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ అందివ్వలేకపోయాడు. మరోవైపు 2016లో కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సమయంలో ఏకంగా ఆ టోర్నీలో నాలుగు సెంచరీలు బాది మరీ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే అక్కడ త్రుటిలో ఆ జట్టు కప్పు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్‌ మళ్లీ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లలేకపోయాడు. అయితే, గతేడాది యూఏఈ లెగ్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.

కాగా, ఇప్పుడు కోహ్లీ తర్వాత ఆర్సీబీని నడిపించే నాయకుడి కోసం ఆ జట్టు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానంగా డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌, సురేశ్‌ రైనా, శ్రేయస్‌ అయ్యర్‌, క్వింటన్‌ డికాక్‌, ఇయాన్‌ మోర్గాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రేసులో ఏబీ డివిలియర్స్‌ పేరు వినిపించినా.. ఇప్పుడు అతడు ఆటకు దూరమవ్వడంతో ఇతర ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఈ ఆటగాళ్లకు ఉన్న అవకాశాలేంటి..?.. వారు ఇదివరకు ఎలా ఆడారో చూద్దాం..

ముందు వరుసలో వార్నరే..

ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. టోర్నీ టాప్‌ స్కోరర్ల జాబితాలో 5,449 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు కెప్టెన్‌గానూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను విజయవంతంగా నడిపించాడు. 2016లో ఆ జట్టుకు టైటిల్‌ అందించిన వార్నర్‌ తర్వాత పరుగుల వరద పారించి నాలుగేళ్లు వరుసగా ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే, గతేడాది ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టింది. తొలుత తుది జట్టు నుంచి తప్పించి తర్వాత కెప్టెన్‌గానూ తీసేసింది. దీంతో వార్నర్‌ ఇప్పుడు వేరే జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, సన్‌రైజర్స్‌ తరఫున అంత మంచి రికార్డు ఉండటంతో ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్‌గా వార్నర్‌ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే తీసుకుంటే అతడికి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఇతరులతో పోల్చితే ఎక్కువగా ఉన్నాయి.

శ్రేయస్‌ స్థానాన్ని పంత్‌ ఆక్రమించడంతో..

ఆర్సీబీలాగే దిల్లీ క్యాపిటల్స్‌ సైతం ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ నెగ్గలేదు. కానీ, ఆ జట్టు మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తోంది. 2018లో తొలిసారి శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు పగ్గాలు అందుకొని బ్యాట్స్‌మన్‌గా రాణించినా కెప్టెన్‌గా విఫలమయ్యాడు. అయితే, తర్వాత ఇంకాస్త బాగా ఆడిన అతడు జట్టును మేటిగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండేళ్లు దిల్లీ ప్లేఆఫ్స్‌ చేరింది. 2020లో ఏకంగా ఫైనల్‌ చేరినా త్రుటిలో కప్పు కోల్పోయింది. దీంతో శ్రేయస్‌ యువ సారథిగా ఆకట్టుకున్నాడు. అయితే, గతేడాది గాయం కారణంగా భారత్‌లో జరిగిన టోర్నీలో అతడు ఆడకపోవడంతో రిషభ్ పంత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా దిల్లీని విజయవంతంగా నడిపించడంతో ఈసారి ఆ ఫ్రాంఛైజీ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఇప్పుడు బెంగళూరుకు వార్నర్‌ తర్వాత మంచి అనుభజ్ఞుడైన కెప్టెన్‌గా శ్రేయస్‌ కనిపిస్తున్నాడు.

రైనా.. కెప్టెన్సీకి తక్కువేమీ కాదు..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంత విజయవంతమైన జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబయి తర్వాత అత్యధికంగా నాలుగుసార్లు కప్పు సాధించిన ఘనత ఆ జట్టుది. అలాంటి జట్టులో ఇన్నాళ్లూ ప్రధాన బ్యాట్స్‌మన్‌గా సేవలందించిన సురేశ్‌ రైనా ఈసారి వేలంలో పాల్గొనబోతున్నాడు. రిటెన్షన్‌ విధానంలో సీఎస్కే వదిలేయడంతో అతడిని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రైనా ప్రస్తుతం 5,528 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత అంత పేరుగాంచిన ఆటగాడు అతడు. వైస్‌ కెప్టెన్‌గానూ సీఎస్కేకు ఎంతోకాలం పనిచేసిన అనుభవం అతడి సొంతం. దీంతో ఆర్సీబీ ఒకవేళ రైనాను తీసుకుంటే.. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా నియమించుకునే అవకాశం లేకపోలేదు.

క్వింటన్‌ డికాక్‌ సైతం సరిపోతాడు..

ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌కు ఎలాంటి స్థితిలోనైనా ఆడగలడ సత్తా ఉంది. ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఓపెనర్‌గా రాణించిన క్వింటన్‌ డికాక్‌ అవకాశం వస్తే కెప్టెన్సీ చేయగల సమర్థుడు. గత మూడు సీజన్లలో రాణించినా ముంబయి ఈసారి అతడిని వదులుకుంది. దీంతో అందరిలాగే వేలంలో పాల్గొంటున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అతడికి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉండటంతో.. ఆర్సీబీ డికాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ బెంగళూరు నిజంగా డికాక్‌ను తీసుకుంటే.. బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌గానే కాకుండా వికెట్‌ కీపర్‌గానూ సేవలందిస్తాడు. దీంతో ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను కూడా ఆర్సీబీ కెప్టెన్సీ జాబితాలో విస్మరించకపోవచ్చు.

స్మిత్‌, మోర్గాన్‌ కూడా..

స్టీవ్‌స్మిత్‌, ఇయాన్‌ మోర్గాన్‌ సైతం కెప్టెన్లుగా, బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకునే క్రికెటర్లే. వీరిద్దరికీ ఐపీఎల్‌లో నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు.. మోర్గాన్‌కు కోల్‌కతా జట్టుకు కెప్టెన్సీ చేశారు. అయితే, అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. బ్యాట్స్‌మెన్‌గా మెరుపులు మెరిపించే ఆటగాళ్లే అయినా ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఒకరు కెప్టెన్సీ పరంగా విఫలమైతే మరొకరు బ్యాట్స్‌మన్‌గా చతికిల పడ్డారు. స్మిత్‌ 2020లో బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్నా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అయితే, గతేడాది దిల్లీ జట్టులోనూ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు మోర్గాన్‌ గతేడాది కోల్‌కతా టీమ్‌లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైనా జట్టును ఫైనల్‌ వరకూ తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వీరిద్దర్నీ ఆయా ఫ్రాంఛైజీలు వదిలేసుకున్నాయి. ఇప్పుడు వేలంలో పాల్గొంటుండంతో ఆర్సీబీ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చనే ఆలోచనలో ఉండొచ్చు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని