Dhoni: జెర్సీ నంబర్‌ 7 ఎందుకిష్టమంటే.. కారణం చెప్పిన ధోనీ

జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టమైన సంఖ్య ఉంటుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి కూడా ఉంది.‌ అదే నంబర్‌ 7. ఇది అందరికీ తెలిసిన విషయమే...

Updated : 29 Mar 2024 14:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టమైన సంఖ్య ఉంటుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి కూడా ఉంది.‌ అదే నంబర్‌ 7. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన నాటి నుంచి.. ఇప్పటికీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున కూడా అదే నంబర్‌తో ఆడుతున్నాడు. అయితే, ధోనీకి నంబర్‌ 7 ఎందుకు ఇష్టం అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అందరూ అది అతడి లక్కీ నంబర్‌ అని అనుకుంటారు. కానీ, అలాంటిదేమీ కాదని మహీనే వెల్లడించాడు. దానికి ఓ చిన్న కారణం ఉందన్నాడు. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అభిమానులతో నిర్వహించిన ఓ సమావేశంలో ధోనీ పాల్గొని ముచ్చటించాడు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన నంబర్‌ 7 పై వివరణ ఇచ్చాడు.

‘మొదట్లో చాలా మంది అది నా లక్కీ నంబర్‌ అనుకున్నారు. కానీ, అలా కాదు. ఓ చిన్న కారణం చేతనే నేను 7 నంబర్‌ని ఎంపిక చేసుకున్నా. నేను పుట్టిన తేది జులై 7. అంటే అది ఏడో నెల ఏడో తారీఖు. అందుకే దాన్ని ఎంపిక చేసుకున్నా. నాకు ఏ సంఖ్య కలిసివస్తుందనే విషయంలో అవీ ఇవీ ఆలోచించకుండా పుట్టిన తేదీనే తీసుకోవాలనుకున్నా. అలాగే ఎవరైనా నన్ను 7 ఎందుకు ఇష్టమని అడిగితే.. నేను పుట్టింది 81వ సంవత్సరంలో కాబట్టి.. 8 నుంచి 1ని తీస్తే 7 వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలా మంది 7 అనేది న్యూట్రల్‌ నంబర్‌ అని, దానివల్ల చెడు కానీ, మంచి కానీ పెద్దగా ప్రభావం చూపవని చెప్పారు. దీంతో నేను కూడా అలాగే వేరేవాళ్లకి చెప్పేవాడిని. అయితే, ఈ విషయంలో నేనేమీ మూఢ నమ్మకంతో ఉండను. ఆ సంఖ్య నా మనసుకు నచ్చింది కాబట్టే దాన్నే ఫాలో అవుతున్నా’ అని మహీ స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని