IPL 2023: ‘కేఎల్‌ రాహుల్, డికాక్‌ ఆరెంజ్‌ క్యాప్‌ పోటీదారులుగా ఉంటారు’

ఐపీఎల్‌-16 (IPL 16) సీజన్‌కు మార్చి 31 నుంచి తెరలేవనుంది. ఈ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, డికాక్‌ ఆరెంజ్‌ క్యాప్‌ పోటీదారులుగా ఉంటారని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Published : 30 Mar 2023 21:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) ఐపీఎల్‌ (IPL)లో ఆడిన మొదటి సీజన్‌లోనే ప్లే ఆఫ్స్‌ చేరి సత్తా చాటింది. 2022లో లఖ్‌నవూ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో ఆ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్‌ డికాక్‌ కీలకపాత్ర పోషించారు. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రాహుల్ 616 పరుగులతో రెండో స్థానంలో, 508 పరుగులతో డికాక్‌ మూడో స్థానంలో నిలిచాడు. రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ 863 రన్స్‌తో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్, డికాక్‌ ఓపెనింగ్ జోడీపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ ఈ సారి కూడా ఆరెంజ్‌ క్యాప్‌ పోటీదారులుగా ఉంటారని ధీమా వ్యక్తం చేశాడు.

‘‘టాప్ ఆర్డర్ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బలం.  ఎందుకంటే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, క్వింటన్‌ డికాక్‌ ఇద్దరూ ఆరెంజ్ క్యాప్ పోటీదారులు. డి కాక్ ఫామ్‌లో ఉన్నాడు. అతను 10-12 ఓవర్లలో సెంచరీ (వెస్టిండీస్‌పై రెండో టీ20లో) సాధించాడు. ఈ మధ్య నిలకడగా ఆడలేకపోతున్న కేఎల్‌ రాహుల్ ఫామ్‌లోకి రావాలి. అతను ప్రతి సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ రేసులో ఉంటాడు. రాహుల్ ఈ సీజన్‌లో బాగా ఆడితే అతడిని విమర్శించే వాళ్ల నోళ్లకు తాళం పడుతుంది. కైల్ మేయర్స్ కొత్త బంతితో ఒకటి లేదా రెండు ఓవర్లు వేయగలడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్ద షాట్లు ఆడగలడు. క్వింటన్ డి కాక్ అందుబాటులో లేకుంటే అతడిని ఓపెనర్‌గా పంపొచ్చు. అప్పుడు దీపక్ హుడాను 3 లేదా  4 స్థానంలో ఆడించొచ్చు. దీపక్‌ మూడో స్థానంలో బాగా ఆడతాడు’’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఐపీఎల్-16 సీజన్‌లో ఏప్రిల్ 1న దిల్లీ క్యాపిటల్స్‌తో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని