Virat Kohli-RCB: విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

ఐపీఎల్‌-16 సీజన్‌లో ఆర్సీబీ తరఫున విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అత్యధిక పరుగులు చేస్తాడని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

Published : 23 Mar 2023 18:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ముగిసింది. ఇక, ఐపీఎల్‌ (IPL) సందడి షురూ కానుంది. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 (IPL-16) సీజన్‌ దాదాపు రెండు నెలలపాటు అలరించనుంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో తమ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోనున్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఐపీఎల్‌లో 22.73 సగటుతో 341 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli ).. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేస్తాడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా  (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని చెప్పాడు.కోహ్లీ, డుప్లెసిస్‌ ఓపెనింగ్‌ చేయాలని, రజత్ పాటిదార్‌ని ఫస్ట్‌ డౌన్‌లో పంపాలని సూచించాడు. 

‘ఆర్సీబీలో డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీలలో ఎవరు అత్యధిక పరుగులు చేస్తారని ప్రశ్నిస్తే.. నేను కోహ్లీ వైపు మొగ్గుచూపుతాను. గతేడాది విరాట్ ఆశించిన మేరకు పరుగులు చేయలేదు. ప్రతి సంవత్సరం అలా జరగదు. అతను ఈ సారి రాణిస్తాడు. ఆర్సీబీ టీమ్‌ కాస్త బలంగా కనిపిస్తోంది. డుప్లెసిస్ రూపంలో వారికి చాలా మంచి కెప్టెన్ ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ విషయానికొస్తే.. డుప్లెసిస్‌తో కలిసి  విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌ చేయాలి. మూడో స్థానంలో రజత్‌ పాటిదార్‌ను పంపించాలి. తర్వాత మ్యాక్స్‌వెల్, మహిపాల్‌ లోమ్రార్‌, షాబాజ్ అహ్మద్‌, దినేశ్‌ కార్తిక్ ఆడాలి. విల్ జాక్స్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను తీసుకుని ఆర్సీబీ మంచి పని చేసింది.  బ్రేస్‌వెల్‌ దూకుడుగా, టీ20 క్రికెట్‌ని అర్థం చేసుకుని ఆడతాడు’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని