IPL 2023: ‘అతడు ఆరెంజ్‌ క్యాప్‌ గెలిస్తే దిల్లీ క్యాపిటల్సే ఛాంపియన్‌’

ఐపీఎల్‌ (IPL 2023) లో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌ దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. అతడు ఈ సారి ఆరెంజ్‌ క్యాప్‌ గెలిస్తే దిల్లీ విజేతగా నిలుస్తుందని భారత మాజీ ఆటడు అజయ్‌ జడేజా అభిప్రాయపడ్డాడు.

Published : 24 Mar 2023 15:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐపీఎల్‌ (IPL 2023)  సిద్ధమవుతోంది. మార్చి 31 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు తమ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో చేరిపోయి ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. ఈ సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది? ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేస్తాడనే వాటిపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన ఆసీస్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ (Mitchell Marsh) ఐపీఎల్‌లోనూ ప్రభావం చూపుతాడని భారత మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా (Ajay Jadeja) అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌ (2008)లో మిచెల్ మార్ష్‌ సోదరుడు షాన్‌ మార్ష్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడని, కానీ అతడు ప్రాతినిధ్యం వహించిన పంజాబ్‌ జట్టు ఛాంపియన్‌గా నిలవలేదని వివరించాడు. ప్రస్తుతం మిచెల్ మార్ష్‌ దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.

‘భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మిచెల్ మార్ష్‌ అద్భుతంగా ఆడాడు. ఈ ప్రదర్శనతో దిల్లీ క్యాపిటల్స్‌ అభిమానులు చాలా సంతోషపడి ఉంటారు. అతడు ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చాడు. మిచెల్‌ సోదరుడు షాన్‌ మార్ష్‌ ఒకసారి ఆరెంజ్‌ క్యాప్‌ గెల్చుకున్నాడు. కానీ, అప్పుడు పంజాబ్‌ విజేతగా నిలవలేకపోయింది. ఒకవేళ ఈ సీజన్‌లో మిచెల్‌ మార్ష్‌ ఆరెంజ్‌ క్యాప్‌ గెల్చుకుంటే దిల్లీ క్యాపిటల్స్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంటుంది. ఈ ఆటగాడి ప్రభావం అలాంటిది మరి’ అని అజయ్‌ జడేజా పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రిషభ్ పంత్‌ ఈ సారి ఐపీఎల్‌లో ఆడటం లేదు. దీంతో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని