LSG vs DC: బ్యాటింగ్‌లో మేయర్స్‌.. బౌలింగ్‌లో మార్క్‌వుడ్.. దిల్లీపై లఖ్‌నవూ సూపర్‌ విక్టరీ

ఐపీఎల్‌-16 (IPL) సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ శుభారంభం చేసింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 01 Apr 2023 23:55 IST

లఖ్‌నవూ: ఐపీఎల్‌-16 (IPL) సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ శుభారంభం చేసింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ ( 56; 48 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. రిలీ రోసోవ్ (30) ఫర్వాలేదనిపించాడు. దిల్లీ బౌలర్లలో మార్క్‌ వుడ్ 14 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

లక్ష్యఛేదనకు దిగిన దిల్లీకి శుభారంభమే అందింది. వార్నర్‌, పృథ్వీ షా దూకుడుగా ఆడటంతో 4 ఓవర్లకు స్కోరు 40/0గా నమోదైంది. తర్వాత  ఐదో ఓవర్‌లో మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టి దిల్లీకి గట్టి షాక్‌ ఇచ్చాడు. పృథ్వీ షా(12), మిచెల్‌ మార్ష్ (0) వరుస బంతుల్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు.  కొద్దిసేపటికే సర్ఫరాజ్‌ఖాన్‌ (4)ని కూడా పెవిలియన్‌కు పంపాడు వుడ్. తర్వాత రిలీ రోసోవ్‌తో జోడీ కట్టిన వార్నర్‌ నిలకడగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. రవి బిష్ణోయ్‌ తన వరుస ఓవర్లలో రిలీ రోసోవ్‌తోపాటు రోవ్‌మన్‌ పావెల్‌ (1)ని   ఔట్‌ చేశాడు. 16 ఓవర్‌లో అవేశ్‌.. అమాన్‌ ఖాన్‌ (4)తోపాటు కీలకమైన వార్నర్‌ వెనక్కి పంపడంతో దిల్లీ ఓటమి ఖాయమైపోయింది. ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ (16), ముఖేశ్‌ కుమార్‌ (0)లను ఔట్‌ చేసి మార్క్‌వుడ్ 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. 

లఖ్‌నవూ బ్యాటర్లలో కైల్‌ మేయర్స్‌ (73; 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచికొట్టాడు. నికోలస్‌ పూరన్‌ (36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుష్‌ బదోని (18; 7 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ తీశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని