Rishabh Pant: రిషభ్‌ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్‌!

రోడ్డు ప్రమాదంలో గాయపడి మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 సీజన్‌కు దూరమైన రిషభ్ పంత్‌  (Rishabh Pant)కు దిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన గౌరవం ఇవ్వనుంది.

Published : 25 Mar 2023 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌.. (Rishabh Pant) డిసెంబరు 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న అతడు మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-16  (IPL 2023) సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది దిల్లీ యాజమాన్యం. ఐపీఎల్‌కు దూరమైన రిషబ్‌ పంత్‌కు దిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్ అరుదైన గౌరవం ఇవ్వనుంది.  ఈ సీజన్‌లో పంత్‌ జెర్సీ నంబర్‌ని ఆటగాళ్ల జెర్సీలు, క్యాప్‌లపై ధరించి  బరిలోకి దిగాలని దిల్లీ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) కూడా ధ్రువీకరించాడు.

‘రిషభ్‌ పంత్‌ను మేం చాలా మిస్‌ అవుతున్నాం. ప్రతీ మ్యాచ్‌కు అతడు డగౌట్‌లో నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నా. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతడిని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాం. మేం అతడి జెర్సీ  నంబర్‌ను మా షర్టులు (జెర్సీలు) లేదా క్యాప్‌లపై ఉంచాలనుకుంటున్నాం. పంత్‌ జట్టుతో లేకపోయినా ఎప్పటికీ అతడే మా నాయకుడు అని తెలియజేయడం కోసమే ఇదంతా చేస్తున్నాం. పంత్‌ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే  సర్ఫరాజ్ ఖాన్‌ మాత్రం మా జట్టులో చేరాడు. ఈ సీజన్‌ ప్రారంభం కావడానికి ముందు మేం కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాం’ అని రికీ పాంటింగ్‌ వివరించాడు. గతేడాది దిల్లీ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఏప్రిల్‌ 1న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ని ఆడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు