Updated : 30/11/2021 23:01 IST

IPL: ఐపీఎల్‌ ఫ్రాంచైజీల రిటెన్షన్‌ జాబితా వచ్చేసింది...!

ఇంటర్నెట్‌ డెస్క్: అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో పాటు దేశవాళీ క్రికెటర్లు కలిసి ఆడే అవకాశం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కల్పిస్తోంది. ఇప్పటివరకు పద్నాలుగు సీజన్లు ముగిశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 15వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సారి 2 కొత్త జట్లు సహా 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అందులో భాగంగా రిటెన్షన్‌ విధానం తీసుకొచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. ఒక్కో జట్టు ఆటగాళ్ల రిటెయిన్‌, వేలం కోసం మొత్తం రూ. 90 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. వేలంలోకి వచ్చే ఆటగాళ్లలో నుంచి కొత్తగా వచ్చే రెండు జట్లు (అహ్మదాబాద్‌, లఖ్‌నవూ) మొదట ఎంచుకునే వీలుంది.

పాత ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసింది. నవంబర్ 30వ తేదీలోపు (ఇవాళ) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి.. బెంగళూరు, హైదరాబాద్‌, రాజస్థాన్‌ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. 

ముంబయి ఇండియన్స్‌ (4) 

ఐపీఎల్‌లో అత్యధిక ఐదుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్‌. ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్‌ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్‌ కిషన్‌తోపాటు ఫిట్‌నెస్‌ సాధిస్తే హార్దిక్‌ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం రూ. 42 కోట్లను కేటాయించింది. రోహిత్‌కు రూ.16 కోట్లు, బుమ్రా (రూ.12), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ.8 కోట్లు), పొలార్డ్‌ (రూ.6 కోట్లు)ను రిటెయిన్‌ చేసుకుంది. ఇంకా ముంబయి వద్ద రూ. 48 కోట్లు ఉంటాయి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (4) 

నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ధోనీకి విడదీయరాని బంధం ఉంది. ఈసారి కూడా సీఎస్‌కే ధోనీని రిటెయిన్‌ చేసుకుంది. ధోనీ కాకుండా రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీని అట్టిపెట్టుకుంది. ‘ధోనీ కోసం రూ. 12 కోట్లు కేటాయించిన సీఎస్‌కే.. జడేజాకు రూ.16 కోట్లు, మొయిన్‌ అలీకి రూ.8 కోట్లు, రుతురాజ్‌ గైక్వాడ్‌కు రూ.6 కోట్లు కేటాయించింది. నలుగురి మీద రూ. 42 కోట్లు ఖర్చు పెట్టిన సీఎస్‌కే.. మిగిలిన మొత్తంతో  చిన్న తలా’గా పేరొందిన సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, అంబటి రాయుడు సహా దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ను వేలంలో కొనుగోలు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (4)

 

గత ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చిన ఇయాన్‌ మోర్గాన్‌ ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు. దీంతో మోర్గాన్‌ను కేకేఆర్‌ రిటెయిన్‌ చేసుకోలేదు. అయితే వేలంలో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కేకేఆర్‌కు కూడానూ నూతన సారథినే ఎంపిక చేస్తుందో చూడాలి. సునీల్‌ నరైన్ (రూ.6 కోట్లు), ఆండ్రూ రస్సెల్‌ (రూ.12 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.8 కోట్లు), వరుణ్ చక్రవర్తి(రూ.8 కోట్లు)ను రిటెయిన్‌ చేసుకుంది. శుభ్‌మన్ గిల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపొచ్చు. నలుగురు ఆటగాళ్ల కోసం రూ. 34 కోట్లు కేటాయించింది.

దిల్లీ క్యాపిటల్స్‌ (4) 

 గత ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో దిల్లీక్యాపిటల్స్‌ను అగ్రస్థానంలో నిలిపిన రిషభ్‌ పంత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలను జట్టు మేనేజ్‌మెంట్‌ అప్పగించింది. రిషభ్‌ (రూ.16 కోట్లు) పాటు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ (రూ.9 కోట్లు), ఓపెనర్‌ పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), పేస్‌ బౌలర్‌ ఎన్రిచ్‌ నార్జ్‌ (రూ. 6.5 కోట్లు)లను అట్టిపెట్టుకుంది. మాజీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ను వేలంలో కొనుగోలు చేసే అవకాశం లేకపోవచ్చు. కొత్త జట్టు అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ దక్కించుకుని కెప్టెన్‌ చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. సీనియర్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ను వేలంలో కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాలి. 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (3)

జట్టు నిండా మ్యాచ్‌ విన్నర్లు ఉన్నా సరే ఒక్కటంటే ఒక్క టైటిల్‌ను గెలవని జట్టు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ). సారథిగా చివరి సీజన్‌లోనైనా విరాట్‌ కోహ్లీ కప్‌ అందిస్తాడేమోనని భావించినా ప్లేఆఫ్స్‌లోనే కథ ముగిసిపోయింది. మరోవైపు ఏబీ డివిలియర్స్‌ ఆటకే వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ కోహ్లీ (రూ.15 కోట్లు)తోపాటు మ్యాక్స్‌వెల్‌ (రూ.11 కోట్లు), మహమ్మద్‌ సిరాజ్‌ (రూ.7 కోట్లు)ను రిటెయిన్‌ చేసుకుంది. ముగ్గురు ప్లేయర్ల కోసం రూ. 33 కోట్లను ఖర్చు చేసింది. మిగతా జట్టు కోసం రూ. 57 కోట్లను కేటాయించనుంది. దేవదుత్‌ పడిక్కల్‌, యుజ్వేంద్ర చాహల్‌ను వేలంలో కొనుగోలు చేయనుంది. డేవిడ్‌ వార్నర్‌ను దక్కించుకుని సారథిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

 పంజాబ్‌ కింగ్స్‌ (2)

కేఎల్‌ రాహుల్‌ను వదిలేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ను అట్టిపెట్టుకుంది. రాహుల్‌ను రిటెయిన్‌ చేసుకోకపోవడానికి కారణాలు తెలియరాలేదు. కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు సారథ్యం వహించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్‌ వ్యక్తిగతంగా రాణించినా.. జట్టును నడపడంలో విఫలమయ్యాడని పంజాబ్ కింగ్స్‌ ఫ్రాంచైజీ భావించింది. అందుకే వదులుకున్నట్లు సమాచారం. మయాంక్‌కు రూ. 12 కోట్లు, అర్ష్‌దీప్‌కు రూ.4 కోట్లతో రిటెయిన్‌ చేసుకుంది. మిగతా మొత్తం రూ. (74 కోట్లు)తో మంచి ఆటగాళ్లను ఎంచుకోనుంది. 

 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (3)

గత సీజన్‌ మధ్యలో కెప్టెన్సీ నుంచి అర్ధంతరంగా తొలగించిన డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) రిటెయిన్ చేసుకోలేదు. దీంతో డేవిడ్‌ మెగా వేలంలోకి రానున్నాడు. సీనియర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (రూ.4 కోట్లు) ఉమ్రాన్‌ మాలిక్‌ (రూ.4 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. ముగ్గురు ఆటగాళ్ల కోసం రూ. 22 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన రూ. 68 కోట్లతో ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. బెయిర్‌స్టో, నబీ, భువనేశ్వర్‌ కుమార్‌ను వేలంలో దక్కించుకునే అవకాశం ఉంది. 

 రాజస్థాన్‌ రాయల్స్‌ (3) 

ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్‌) ఆ తర్వాత దారుణమైన ఆటతీరును ప్రదర్శించింది. కేవలం మూడే సార్లు (2013, 2015, 2018) మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. మిగతా అంతా గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైంది. కెప్టెన్‌ను మార్చినా ఫలితంలో మాత్రం మార్పు రావడం లేదు. సంజూ శాంసన్‌ సారథ్యంలో గత ఐపీఎల్‌లోనూ ఆఖరి నుంచి రెండో స్థానానికే పరిమితమైంది. దీంతో ఈ సారి జట్టులో పెను మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి సంజూ కెప్టెన్సీకి వచ్చిన నష్టమేమీ లేదు. శాంసన్‌ (రూ. 14 కోట్లు)తోపాటు బట్లర్‌ (రూ. 10 కోట్లు), జైశ్వాల్ (రూ.4 కోట్లు)ను రిటెయిన్‌ చేసింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని