Updated : 02/12/2021 15:30 IST

IPL: ఆ ఐదు జట్లు.. ఐదుగురు టాప్‌ ప్లేయర్లు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ పూర్తైంది. పాత ఎనిమిది ఫ్రాంచైజీలు 27 మంది ఆటగాళ్లను కొనసాగించి మిగతావారిని వదిలేశాయి. వచ్చే సీజన్‌ కోసం కొత్తగా మరో రెండు జట్లు అదనంగా చేరాయి. ఈ క్రమంలో వదిలేసిన ఆటగాళ్లలో నుంచి ముగ్గురిని ఎంచుకునే అవకాశం కొత్త ఫ్రాంచైజీలకు ఉంటుంది. అదీ డిసెంబర్ 1 నుంచి 25వ తేదీలోపు  ఎంపిక చేసుకోవాలి. అలానే ఇప్పుడున్న ఎనిమిది జట్లలో సీఎస్‌కే, ముంబయి, ఎస్‌ఆర్‌హెచ్‌, దిల్లీ, రాజస్థాన్‌ జట్లు మాత్రమే సారథులను రిటెయిన్‌ చేసుకున్నాయి. అంటే ఇప్పుడు పాతవి మూడు, కొత్తవి రెండుతో మొత్తం 5 జట్లకు కెప్టెన్‌లను నియమించాల్సి ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీలు రిటెయిన్‌ చేసుకోని టాప్‌ ప్లేయర్లలో ఎవరికి అవకాశం ఉందో ఓ సారి పరిశీలిద్దాం.. 

మొదటి ప్రాధాన్యం డేవిడ్ భాయ్‌కే..

కొత్త ఫ్రాంచైజీలు అయిన లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ కానీ.. పాత జట్లు ఆర్‌సీబీ, కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ఎంచుకోవాలంటే మాత్రం తొలి ప్రాధాన్యం డేవిడ్‌ వార్నర్‌కే ఇస్తాయని క్రీడా విశ్లేషకుల అంచనా. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన అనుభవం... సీనియర్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా ఎంత ఒత్తిడిలో అయినా లక్ష్య ఛేదనకు దిగితే ఆపడం ఎవరి తరమూ కాదు. గత సీజన్‌లో సరైన ఫామ్‌లో లేకపోవడంతో హైదరాబాద్‌ యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తొలగించింది. అయితే, ఐపీఎల్‌ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచి మరోసారి సవాల్‌ విసిరాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌ గణాంకాలు ఇలా ఉన్నాయి. 

ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లు: 150

చేసిన పరుగులు: 5,449

స్ట్రైక్‌రేట్: 139.96

శతకాలు: 4

అర్ధశతకాలు: 50

అత్యధిక పరుగులు: 126

భారీగా పరుగులు చేయడంలో దిట్ట

వ్యక్తిగతంగా గత మూడు సీజన్ల నుంచి కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన అద్భుతంగా రాణించాడని చెప్పాలి. 2018 సీజన్‌లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లోనూ 670 పరుగులు, ఐపీఎల్‌ 14వ సీజన్‌ (2021)లో 626 పరుగులు చేశాడు. అయితే, తన విలువకు తగ్గట్టు భారీ మొత్తాన్ని దక్కించుకోవాలని మెగా వేలానికి వస్తున్నట్లు సమాచారం. మూడేళ్ల కిందట రూ.11 కోట్లతో పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుని సారథ్యాన్ని అప్పగించింది. పాపం తన అత్యుత్తమ ప్రదర్శన అయితే చూపించాడు. కానీ.. జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో మాత్రం విఫలమయ్యాడు. ఈ జట్టు గత మూడేళ్లుగా ఆరోస్థానంతోనే టోర్నీని ముగించడం గమనార్హం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు..

ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 94

పరుగులు: 3,273

స్ట్రైక్‌రేట్‌: 136.37

శతకాలు: 2

అర్ధశతకాలు: 27

అత్యధిక పరుగులు: 132

వారు పక్కన పెట్టేశారు.. మరి ఎవరు తీసుకుంటారో?

దిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చి కప్‌ అందించినంత పని చేశాడు శ్రేయస్‌ అయ్యర్‌. 2020 సీజన్‌లో అయ్యర్‌ నేతృత్వంలోని డీసీ ఫైనల్‌కు చేరింది. అయితే ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమి చవిచూసింది. అంతకుముందు ఏడాది (2019) సీజన్‌లో దిల్లీ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. అయితే, ఇన్ని ఘనతలు సాధించిన అయ్యర్‌ను పక్కన పెట్టేసి రిషభ్‌ పంత్‌ను 2021 సీజన్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. మరోసారి ప్లేఆఫ్స్‌కే పరిమితమైపోయింది. ఈ క్రమంలో తనను సారథ్యం నుంచి తప్పించినందుకు శ్రేయస్‌ అయ్యర్‌ మెగా వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త జట్లలో ఏదైనా ఎంచుకుంటే మాత్రం సారథిగా నియమించుకుంటుంది. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ప్రదర్శన ఎలా ఉందంటే..

మొత్తం మ్యాచ్‌లు: 87

పరుగులు: 2,375

స్ట్రైక్‌ రేట్‌: 123.95

శతకాలు: ఒక్కటి కూడా లేదు

అర్ధశతకాలు: 16

అత్యధిక పరుగులు: 96

ఎస్‌ఆర్‌హెచ్‌  మళ్లీ దక్కించుకుంటుందా?

సన్‌రైజర్స్‌ కీలక ఆటగాళ్లలో జానీ బెయిర్‌స్టో ఒకడు. వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చి బీభత్సమైన ఇన్నింగ్స్‌లను ఆడిన సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి ఎస్‌ఆర్‌హెచ్‌ అతడిని రిటెయిన్‌ చేసుకోలేదు. మెగా వేలంలో మాత్రం కచ్చితంగా దక్కించుకుంటుందని తెలుస్తోంది. అయితే, ఈ లోపు మంచి ధరకు కొత్త ఫ్రాంచైజీలు లాగేసుకుంటే మాత్రం బెయిర్‌స్టో పంటపండినట్లే. బెయిర్‌స్టో రాణించిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్‌ దాదాపు విజయం సాధించింది. మరి ఈ డాషింగ్‌ ఓపెనర్‌ను ఎవరైనా లాగేసుకుంటారో.. లేకపోతే సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసుకుంటుందో వేచి చూడాలి. రెండేళ్ల కింద ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో గణాంకాలను చూడండి.. 

మొత్తం మ్యాచ్‌లు: 28 

పరుగులు: 1,038

స్ట్రైక్‌రేట్‌: 142.19

శతకాలు: 1

అర్ధశతకాలు: 7

అత్యధిక పరుగులు: 114

యువకుడికి కెప్టెన్సీ అప్పగించాలంటే...

మూడేళ్ల కిందట అత్యంత పిన్న వయస్సులో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ గిల్‌ కోల్‌కతా జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే, ఈ సారి కేకేఆర్‌ రిటెయిన్‌ లిస్ట్‌లో లేకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. మెగా వేలంలో కోల్‌కతానే గిల్‌ను సొంతం చేసుకుంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మూడేళ్లలో ఓపెనర్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లను ఆడాడు. మొదట్లో మిడిలార్డర్‌లో ఆడే గిల్‌ ఓపెనర్‌ అవతారం ఎత్తి పవర్‌ప్లేలో హిట్టింగ్‌ చేస్తాడనే పేరును సంపాదించాడు. నూతన ఫ్రాంచైజీల్లో రిటెయిన్‌ కాకుండా ఉన్న సీనియర్లలో కాకుండా ఎవరిని తీసుకోవాలి అనే ప్రశ్నకు గిల్‌ రూపంలో సమాధానం లభిస్తుంది. కాబట్టి యువ క్రికెటర్‌ను సారథిగా నియమించుకుంటే భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే గిల్‌ ఎంపికా మంచిదే.

మ్యాచ్‌లు: 58

పరుగులు: 1,417

స్ట్రైక్‌రేట్‌: 123

శతకాలు: 0

అర్ధశతకాలు: 10

అత్యధిక పరుగులు: 76

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని