IPLతోనే ఆ ఆత్మవిశ్వాసం: అవేశ్‌ 

ఐపీఎల్‌-21లో ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని దిల్లీ క్యాపిటల్స్‌ పేస్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అన్నాడు. మ్యాచులు గెలవడం, పాయింట్ల పట్టికలో....

Published : 09 May 2021 00:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-21లో ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని దిల్లీ క్యాపిటల్స్‌ పేస్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అన్నాడు. మ్యాచులు గెలవడం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం సంతోషకరమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో 8 మ్యాచులాడిన అతడు 14 వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ రేసులో నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో మధ్య ప్రదేశ్‌కు ఆడే అవేశ్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు స్టాండ్‌బైగా ఎంపికైన సంగతి తెలిసిందే.

‘నాకు అప్పగించిన బాధ్యతను చక్కగా ఉపయోగించుకున్నా. మ్యాచుల్లో ప్రతి దశలో బౌలింగ్‌ చేశాను. కొత్త బంతితో, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌ చేశాను. దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌లు, కెప్టెన్‌ నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రతి సందర్భంలోనూ నేను రాణించాను’ అని అవేశ్‌ అన్నాడు.

‘దేశవాళీ క్రికెట్లో రెండు సీజన్లుగా నేనెంతో రాణిస్తున్నాను. కానీ ఐపీఎల్‌ మాత్రం నన్ను వెలుగులోకి తెచ్చింది. ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ ఈ ఏడాది 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాను. రంజీల్లో నిలకడగా సరైన లెంగ్తుల్లో బంతులు వేయడం కీలకం. ఎంత ఎక్కువ నిలకడగా ఆడితే అంత ఎక్కువ మెరుగవుతాను. ఇక టెస్టు మ్యాచులకు సహనం ఎక్కువ అవసరం’ అని అవేశ్‌ తెలిపాడు.

ఐపీఎల్‌ వల్ల తన ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిందని ఖాన్‌ అన్నాడు. లీగులో ఆడటం వల్ల ఉపయోగం ఇదేనన్నాడు. ఏకాగ్రత పెరుగుతుందని, ఒత్తిడిలో నేర్చుకోనే అవకాశం లభిస్తుందని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలమన్న ధైర్యం లభించిందన్నాడు. 

ఏకాగ్రతతో 100% బౌలింగ్‌ చేయాలని డీసీ కోచ్‌ రికీ పాంటింగ్‌ తనకు చెప్పాడని అవేశ్‌ తెలిపాడు. రిషభ్ సారథి కావడం తనకు కలిసొచ్చిందని, గతంలో అతడితో కలిసి ఆడిన అనుభవం ఉందన్నాడు. మ్యాచులు ముగిశాక చేసిన పొరపాట్ల గురించి తామిద్దరం చర్చించుకొనే వాళ్లమని వివరించాడు. శారీరక దారుఢ్యం కోసం ఓ డైటీషియన్‌ను నియమించుకున్నానని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని