RR vs RCB: గెలిచి తీరాల్సిందే.. అప్పుడే నిలుస్తారు..!

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) ఇవాళ డబుల్‌ హెడ్డర్స్‌లో భాగంగా ఆసక్తికరమైన మ్యాచ్‌లు ఉన్నాయి. అందులో రాజస్థాన్‌ X బెంగళూరు జట్ల మధ్య పోరు కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. ఇందులో రాజస్థాన్‌ ఓడితే ప్లేఆఫ్స్ ఛాన్స్‌లు సంక్లిష్టంగా మారతాయి. బెంగళూరు ఇంటిబాట పట్టడం ఖాయమవుతుంది.

Published : 14 May 2023 13:45 IST

ఇంటర్నెట్ డెస్క్: హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajsthan Royals) ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Chellengers Bangalore) పరిస్థితి కూడా రాజస్థాన్‌కు భిన్నంగా ఏమీ లేదు. ప్రస్తుతం రాజస్థాన్‌ 12 పాయింట్లతో ఐదో స్థానంలో.. 10 పాయింట్లతో ఏడో స్థానంలో బెంగళూరు కొనసాగుతున్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆర్‌సీబీకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌, బెంగళూరు (RR vs RCB) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. దూకుడుగా ఆడుతున్న యశస్విను అడ్డుకోవడం ఆర్‌సీబీ బౌలర్లకు సవాల్‌తో కూడుకున్నదే. ఆరెంజ్‌ క్యాప్‌ కోసం ఫాఫ్‌ డుప్లెసిస్‌తో యశస్వి పోటీపడుతున్నాడు. ఫాఫ్‌ 576 పరుగులతో ఉండగా.. యశస్వి 575 పరుగులతో కొనసాగుతున్నాడు. 

బ్యాటింగ్‌ X బౌలింగ్‌

రాజస్థాన్‌ బ్యాటింగ్‌  X బెంగళూరు బౌలింగ్‌కు మధ్య ఆసక్తికర పోరు జరగడం మాత్రం ఖాయం. ఎవరిది పైచేయి సాధిస్తారనేది చూడాలి. యశస్వి, జోస్ బట్లర్, సంజూశాంసన్, షిమ్రోన్ హెట్మెయర్‌ వంటి భారీ హిట్టర్లను సిరాజ్, హర్షల్‌ పటేల్, హసరంగ, జోష్ హేజిల్‌వుడ్‌ అడ్డుకోగలిగితేనే బెంగళూరు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రాజస్థాన్‌ బౌలింగ్‌ విభాగంలో యుజ్వేంద్ర చాహల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలవడంలో చాహల్‌ బౌలింగ్‌ ప్రదర్శనే కీలకంగా మారింది. బౌల్ట్, సందీప్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌తో కూడిన బౌలింగ్‌ దళం రాజస్థాన్‌ సొంతం. బ్యాటింగ్‌లో డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పైనే బెంగళూరు ఆధారపడుతోంది. ఇదే ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. మిడిలార్డర్‌లో దినేశ్‌ కార్తిక్,  హసరంగ చెలరేగాల్సిన అవసరం ఉంది. కొత్తగా చేరిన కేదార్‌ జాదవ్‌ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జట్లు (అంచనా)

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), జో రూట్, ధ్రువ్‌ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, కేఎం అసిఫ్

బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్‌ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, అనుజ్‌ రావత్, మహిపాల్ లామ్రోర్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్, సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు