Updated : 30/11/2021 01:53 IST

IPL Mega Auction : గత సీజన్‌లో భారీ ధర సరే.. ఈసారి వారి పరిస్థితేంటి?

ఇప్పుడు రాబోయేది అసలే ఐపీఎల్‌ మెగా వేలం. కొత్తగా రెండు జట్లు కూడా అదనంగా చేరుతున్నాయి. ఇప్పుడు ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకునే వెసులుబాటు. మిగతావారంతా మెగా వేలంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఏ జట్టు ఎవరిని తీసుకుంటుందో.. ఎంత మొత్తానికి దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఆలోపు గత సీజన్‌ వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకున్న ఆటగాళ్లలో ఆయా జట్లు ఎవరిని రిటెయిన్‌ చేసుకునే అవకాశం ఉంది.. మరి మిగతావారి పరిస్థితి ఏంటనేది ఓ సారి చూసేద్దాం.. 

క్రిస్‌ మోరిస్‌:  రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు. దాదాపు రూ. 16.25 కోట్లు సొంతం చేసుకున్న ఈ ఆల్‌రౌండర్‌ గత సీజన్‌లో పెద్దగా రాణించిందేమీ లేదు. తన విలువకు తగ్గ న్యాయం మాత్రం చేయలేకపోయాడు. రెండు విడతలవారీగా జరిగిన 14వ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో అయితే మరీ దారుణం. కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చినా.. కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సారి క్రిస్‌ మోరిస్‌ను ఆర్‌ఆర్‌ రిటెయిన్‌ చేసుకోవడం కష్టమే. అంతేకాకుండా వేలంలోనూ భారీ ధర దక్కకపోవచ్చు. 

ప్యాట్‌ కమిన్స్‌: ఆసీస్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కేకేఆర్‌ రూ. 15.5 కోట్లకు సొంతం చేసుకుంది. భారత్‌లో జరిగిన తొలి దశలో మాత్రమే ప్యాట్‌ కమిన్స్‌ ఆడాడు. ఏడు మ్యాచుల్లో 93 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు. తొమ్మిది వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 3/24. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్‌ను ఈసారి కేకేఆర్‌ రిటెయిన్‌ అయితే చేసుకోవడం లేదు. వేలంలోనూ ఇంత భారీ ధర దక్కకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

మ్యాక్స్‌వెల్‌: ఆల్‌రౌండర్‌ అయిన ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌2020లో రాణించని మ్యాక్సీ.. రెండు దశల్లో జరిగిన ఐపీఎల్‌ 2021లో మాత్రం బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 15 మ్యాచులు 14 ఇన్నింగ్స్‌ల్లో 513  పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. హైయస్ట్‌ స్కోరు 76 పరుగులు. అయితే విరాట్ కోహ్లీతో సహా మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటెయిన్‌ చేసుకోనుంది.  

సునిల్ నరైన్‌:  కేకేఆర్‌ తరఫున ఆడే ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ను ఆ ఫ్రాంచైజీ రూ. 12.55 కోట్లకు దక్కించుకుంది. విభిన్నమైన స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే నరైన్‌ను కేకేఆర్‌ రిటెయిన్‌ చేసుకుంటుందని సమాచారం. బ్యాటింగ్‌లోనూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. గత సీజన్‌లో కేకేఆర్‌ ఫైనల్‌కు రావడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో 62 పరుగులే చేసినా.. కీలక ఇన్నింగ్స్‌లను ఆడాడు. 

డేవిడ్ వార్నర్‌ ( రూ. 12.55 కోట్లు) : క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకారో టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో నిరూపించాడు డేవిడ్‌ వార్నర్‌. ఆసీస్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర వార్నర్‌దే. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. అయితే గత సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచే తీసేసింది. తొలి దశలో అన్ని మ్యాచ్‌లను (7) ఆడిన వార్నర్‌.. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో మాత్రం కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడాడు. మిగతా మ్యాచుల్లో తుది జట్టులో స్థానం కూడా దక్కలేదు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ను వార్నర్‌ వీడిపోతాడని అప్పుడే భావించారు. దానికి తగ్గట్టే డేవిడ్‌ కూడా వేలంలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. ఈ సారి మెగా వేలంలో హాట్‌ టాపిక్‌గా డేవిడ్‌ వార్నర్‌ మారే అవకాశం ఉంది. 

కేఎల్‌ రాహుల్‌: పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌ను రూ. 11.95 కోట్లకు సొంతం చేసుకుంది. వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కేఎల్‌ రాహుల్‌ది (626) మూడో స్థానం. అయితే జట్టును నడిపించడంలో విఫలమయ్యాడనే విమర్శలు వస్తుండటం, పంజాబ్ కింగ్స్‌ రిటెయిన్‌ చేసుకోదనే వార్తల నేపథ్యంలో మెగా వేలంలోకి వెళ్లేందుకు రాహుల్‌ మొగ్గు చూపుతున్నాడు. అంతేకాకుండా కొత్త ఫ్రాంచైజీల్లో ఏదో ఒక జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

రషీద్‌ ఖాన్‌: ఎస్‌ఆర్‌హెచ్‌ తురుపుముక్క ఆటగాళ్లలో రషీద్‌ ఖాన్‌ ఒకడు. అతడిని ఫ్రాంచైజీ రూ. 8.90 కోట్లకు కొనుగోలు చేసింది. 14 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టిన రషీద్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 3/36. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ అప్పుడప్పుడూ మెరుస్తుంటాడు. పది ఇన్నింగ్స్‌ల్లో 83  పరుగులు చేశాడు. కీలక ఆటగాడైన రషీద్‌ ఖాన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పుడైతే వదులుకోదు. కెప్టెన్‌ విలియమ్సన్‌తోపాటు రషీద్‌ను రిటెయిన్‌ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

హార్దిక్‌ పాండ్య: ముంబయి ఇండియన్స్ జట్టులో హార్దిక్‌ పాండ్య కీలక ఆటగాడు. ఆ జట్టు విజయాల్లో ఎన్నోసార్లు తనవంతు పాత్ర పోషించాడు. దీంతో గతేడాది ముంబయి యాజమాన్యం అతడిని రూ.11 కోట్లతో అట్టిపెట్టుకుంది. అయితే, కొంతకాలం కిందట వెన్నెముక శస్త్ర చికిత్స చేసుకున్న పాండ్య తర్వాత బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడి బ్యాటింగ్‌లో 14.11 సగటుతో కేవలం 127 పరుగులే చేశాడు. మరోవైపు బౌలింగ్‌లో అసలు బంతే అందుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే మెగా వేలంలో ముంబయి హార్దిక్‌ను వదులుకునే వీలుంది.

గత సీజన్‌ వరకు ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్‌ కోహ్లీ (రూ. 17 కోట్లు) అత్యధిక విలువైన ఆటగాడు. ఈ సారి కూడా ఆర్‌సీబీ కోహ్లీని రిటెయిన్‌ చేసుకుంటుందని సమాచారం. అయితే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా సారథిలలో ఎంఎస్ ధోనీ - రూ. 15 కోట్లు (సీఎస్‌కే), రోహిత్ శర్మ - రూ. 15 కోట్లు (ముంబయి ఇండియన్స్), రిషభ్‌ పంత్‌ - రూ. 15 కోట్లు (దిల్లీ క్యాపిటల్స్) ముందు వరుసలో ఉన్నారు. వీరిందరినీ ఆయా జట్లు అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని