Published : 07/12/2021 10:18 IST

IPL : వదిలేసిన ప్లేయర్లను ఫ్రాంచైజీలు మళ్లీ కొనుగోలు చేస్తాయా..?

ఇంటర్నెట్‌ డెస్క్:  ఓడలు బళ్లు కావడం.. బళ్లు ఓడలు కావడం గురించి వింటూనే ఉంటాం.. సరిగ్గా ఇది ఐపీఎల్‌లో క్రికెటర్లకు సరిపోతుందేమో.. కొంత మంది స్టార్‌ ప్లేయర్లను ఈ సారి అసలు ఆయా జట్ల యాజమాన్యాలు పరిగణనలోకే తీసుకోలేదు. అదే సమయంలో అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయని) ఆటగాళ్ల పంట పడిందనే చెప్పాలి. ఎన్నో ఈక్వేషన్లు.. లెక్కలతో తర్జనభర్జనలు పడి ఎట్టకేలకు రిటెన్షన్‌ ప్రక్రియను పూర్తి చేసేశాయి ఫ్రాంచైజీలు. ఎనిమిది జట్లు మొత్తం 27 మంది ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకున్నాయి. 

యూనివర్సల్‌ బాస్ గేల్‌, డేవిడ్‌ భాయ్‌‌, బెయిర్‌ స్టో, జాసన్ రాయ్‌, కేఎల్‌ రాహుల్, రషీద్‌ ఖాన్‌, డుప్లెసిస్‌, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్ ‌.. వీళ్లంతా టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్లు. అసలే రెండు కొత్త జట్లు వస్తున్నాయి. వీరిలో ఎవరిని (గరిష్ఠంగా ముగ్గురిని) తీసుకుంటాయో డిసెంబర్‌ 25 లోపు తెలిసిపోతుంది. మిగతా ఆటగాళ్లు మెగా వేలంలోకి వచ్చేస్తారు. అయితే ఈసారి మెగా వేలం రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కొత్త కాంబినేషన్లతో వచ్చే జట్లు వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో తలపడే అవకాశం ఉంది. అయితే ఆయా జట్లు తమ టాప్ ప్లేయర్లను వదిలేశాయి.

సమూల మార్పులు తప్పవా..?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు అంటే స్వల్ప స్కోర్లను కూడా కాపాడుకోలగలదనే పేరుంది. బ్యాటింగ్‌లో కేన్‌ విలియమ్సన్, బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్, మనీశ్ పాండే.. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌, హోల్డర్‌, సందీప్ శర్మ కీలక ఆటగాళ్లు. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన చరిత్ర డేవిడ్‌ వార్నర్‌ది. అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. దీంతో జట్టులో సమూల మార్పులు చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సారి కేన్‌ను తప్ప మిగతావారిని ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసుకుంది. కేన్‌తోపాటు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్‌, అబ్దుల్‌ సమద్‌ను అట్టిపెట్టుకుంది. మేనేజ్‌మెంట్‌తో విభేదాల నేపథ్యంలో వార్నర్‌ వెళ్లిపోతున్నాడని.. రషీద్‌ ఖాన్‌ వేరే ఫ్రాంచైజీతో చర్చలు జరపడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసిందనే ప్రచారం సాగుతోంది. మరోసారి సారథిగా కేన్‌ విలియమ్సన్‌ బాధ్యతలు చేపడతాడని ఇప్పటికే యాజమాన్యం వెల్లడించింది. మిడిలార్డర్‌లో ఆదుకునే ఆటగాడు కరువై ఎన్నో మ్యాచ్‌లను ఎస్‌ఆర్‌హెచ్‌ చేజార్చుకుంది. అందుకే ఈ సారి మెగా వేలంలో ఆ లోటును పూరించే ఆటగాళ్ల కోసం వెచ్చించేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సిద్ధమవుతోంది.


కెప్టెన్‌నే వదిలేసుకున్న పంజాబ్‌ కింగ్స్

వరుసగా రెండేళ్లపాటు జట్టును నడిపించిన సారథినే వదులుకున్న ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్‌-5లో ఉన్న ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. అలాంటి ప్లేయర్‌ను రిటెయిన్‌ చేసుకోలేదు. రాహుల్‌ వేలంలోకి వెళ్లేందుకు మొగ్గు చూపడమే దీనికి కారణమని జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లే వెల్లడించాడు. అలానే యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ డేవిడ్ మలన్‌ను కూడా అట్టిపెట్టుకోలేదు. ప్రస్తుతం ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే కానీ.. తనదైన రోజున గేల్‌ క్రీజ్‌లో ఉంటే మాత్రం ఎంతటి బౌలర్‌కైనా వణుకు పుట్టాల్సిందే. అలానే పూరన్‌ కూడా మంచి హిట్టరే. అయితే పంజాబ్‌ కేవలం ఇద్దరిని మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తోపాటు బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ను అట్టిపెట్టుకుంది. షమీ, దీపక్‌ హుడా, పూరన్‌, షారుఖ్‌ ఖాన్‌, మురుగన్ అశ్విన్‌, రిచర్డ్‌సన్‌ను వేలంలో కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాలి. వ్యక్తిగతంగా అద్భుతంగా ఆడే ఆటగాళ్లున్నప్పటికీ జట్టుగా రాణించడంలో మాత్రం విఫలమవుతున్నారు. యూనివర్సల్‌ బాస్‌ను మళ్లీ కొనుగోలు చేయడం కష్టమే.


ఫామ్‌లో లేకపోవడమే వారికి శాపమా?

రిలయన్స్‌ అంబానీ జట్టు ముంబయి ఇండియన్స్. ఇందులో ఉండే ఆటగాళ్లు ఓ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఈ సారి పాండ్య బ్రదర్స్ హార్దిక్‌, కృనాల్‌లో ఒక్కరిని కూడా రిటెయిన్‌ చేసుకోలేదు. అయితే వేలంలోనైనా కొనుగోలు చేస్తుందో లేదో.. ఫామ్‌ పరంగా చూస్తే హార్దిక్ గత రెండేళ్లుగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించలేదు. కృనాల్‌ కూడా సరైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో వారిద్దరిని ముంబయి వదిలేసుకుంది. సీనియర్లు రోహిత్‌, బుమ్రా, పొలార్డ్‌తోపాటు సూర్యకుమార్‌ యాదవ్‌ను రిటెయిన్‌ చేసుకుంది. పొలార్డ్‌ గత సీజన్‌లో సరిగ్గా ఆడలేకపోయినా.. అట్టిపెట్టుకోవడం విశేషం.  ఇషాన్‌ కిషన్‌తోపాటు ట్రెంట్ బౌల్ట్‌, జేమ్స్ నీషమ్‌, రాహుల్‌ చాహర్‌ను మరోసారి వేలంలోకి దక్కించుకోవాలని ముంబయి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. డికాక్‌ను కూడా తీసుకునే అవకాశాలు లేకపోలేదు. 


వారిని సీఎస్‌కేనే దక్కించుకుంటుందా?

నాలుగుసార్లు ఛాంపియన్‌, గత సీజన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌. సారథి ఎంఎస్ ధోనీ అదనపు బలం. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, డుప్లెసిస్‌ ఎన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారో తెలుసు. అలానే మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, ‘చిన్న తలా’ సురేశ్ రైనా, రాబిన్‌ ఉతప్ప, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బ్రావో కీలకమైన ఆటగాళ్లు. ఈ క్రమంలో కెప్టెన్‌ ధోనీతోపాటు రుతురాజ్‌ గైక్వాడ్, సీనియర్‌ ఆల్‌ రౌండర్లు మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ గత సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. డుప్లెసిస్, రైనా, రాయుడు, ఉతప్పతో సహా మిగతావారిని వేలంలో దక్కించుకునేందుకు సీఎస్‌కే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. మరి ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు ఆడతాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. నలభై పడి దాటిన ఇమ్రాన్‌ తాహిర్‌కు అవకాశం రావడం కష్టమే. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లను తీసుకోవాలని సీఎస్‌కే భావిస్తే మాత్రం వేలం రసవత్తరంగా మారడం ఖాయం.


ఆడకపోయినా మరొక అవకాశం

ఆండ్రూ రస్సెల్‌ భీకరమైన ఆటగాడు. ఎంతటి లక్ష్యాన్నైనా అలవోకగా ఛేదించేస్తాడు. ఆల్‌రౌండర్‌ అయిన రస్సెల్‌ గత సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అయినా సరే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. రిటెన్షన్‌ లిస్ట్‌లోని తొలి పేరును రస్సెల్‌కే కేటాయించింది. మరి ఈసారైనా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడాలని కోల్‌కతా అభిమానులు కోరుతున్నారు. గత వేలంలో భారీ ధరకు (రూ.15.50 కోట్లు) కొనుగోలు చేసిన ప్యాట్‌ కమిన్స్‌ను వదిలేసుకుంది. రస్సెల్‌తోపాటు మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, ఆల్‌రౌండర్ సునిల్‌ నరైన్, వెంకటేశ్ అయ్యర్‌ను అట్టిపెట్టుకుంది. కేకేఆర్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన ఇయాన్‌ మోర్గాన్‌, యువ క్రికెటర్లు రాహుల్‌ త్రిపాఠి, నితీశ్ రాణా, ప్రసిధ్ కృష్ణ, సీనియర్లు దినేశ్‌ కార్తిక్‌, ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌తోపాటు ప్యాట్‌ కమిన్స్‌ను మరోసారి కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాలి. ఇయాన్‌ మోర్గాన్‌ను మళ్లీ జట్టులో తీసుకోకపోతే.. అప్పుడు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. మోర్గాన్‌ ఆటగాడిగా విఫలమైనా సారథిగా మాత్రం సక్సెస్‌. తన నాయకత్వ పటిమతో ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేర్‌ఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే సీఎస్‌కే చేతిలో ఓటమి తప్పలేదనుకోండి..


చాహల్‌, పడిక్కల్‌కు ఛాన్స్ ఉందా..? 

పాపం.. మ్యాచ్‌ విన్నర్లు ఉన్నా ఒక్కటంటే ఒక్క టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోలేకపోయిన టీమ్‌ ఏందంటే ఠక్కున చెప్పేది రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు గురించే. బ్యాటింగ్‌కు వస్తే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌, డానియల్‌ క్రిష్టియన్‌, దేవదుత్‌ పడిక్కల్‌.. ఇటు బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్, సిరాజ్‌, జేమీసన్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. అయితే జట్టు నిండా స్టార్లు ఉన్నా.. అవసరమైన సమయంలో అంతా చేతులెత్తేయడంతో ఆర్‌సీబీకి కష్టాలు తప్పలేదు. కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు విరాట్‌ కోహ్లీ గత యూఏఈ సీజన్‌ సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సారథ్య బాధ్యతలు వేరొకరికి అప్పగించాల్సిన పరిస్థితి ఆర్‌సీబీకి వచ్చింది. ఏబీ డివిలియర్స్‌ ఆటకే వీడ్కోలు పలికాడు. ఇక సీనియర్‌ మ్యాక్స్‌వెల్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పుతుందా..? లేక మెగా వేలంలో టాప్‌ ప్లేయర్‌ను తీసుకుని కెప్టెన్‌ను చేస్తుందో వేచి చూడాలి. విరాట్, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ను మాత్రమే ఆర్‌సీబీ రిటెన్షన్ చేసుకుంది. ఓపెనర్‌ దేవదుత్‌ పడిక్కల్‌, స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను దక్కించుకునేందుకు ఆర్‌సీబీ యత్నించొచ్చు. 


పాపం గొప్ప ఆరంభం.. ఆ తర్వాత అంతా శూన్యం 

ఐపీఎల్‌ ఆరంభ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు.. ఆ తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడానూ ఫైనల్‌కు చేరకపోవడం విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది సత్యం. రాజస్థాన్‌ రాయల్స్ షేన్‌వార్న్‌ నాయకత్వంలో 2008 టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే 2009 నుంచి మొన్న 2021 వరకు జరిగిన ఐపీఎల్‌లో మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. 2016, 2017 సీజన్లలో ఆర్‌ఆర్‌ మీద బీసీసీఐ నిషేధం విధించింది. సీజన్‌లు, సారథులు మారినా జట్టు తలరాత మాత్రం మారడం లేదు. 14వ సీజన్‌కు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించినా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలోనే నిలవడం గమనార్హం. బెన్‌స్టోక్స్‌, బట్లర్‌, శాంసన్, గ్లెన్‌ ఫిలిప్స్‌, శివమ్‌ దూబే, లివింగ్‌ స్టోన్‌, డేవిడ్‌ మిల్లర్‌ వంటి హేమాహేమీలు ఉన్నా విజయాలు మాత్రం దరిచేరడం లేదు. దీంతో వచ్చే సీజన్‌కు జట్టులో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో రిటెయిన్‌ జాబితాలో సంజూ శాంసన్‌తోపాటు టీ20 స్పెషలిస్టులు జోస్‌ బట్లర్‌, యువ క్రికెటర్‌ యశస్వి జైశ్వాల్‌ను అట్టిపెట్టుకుంది. మరి ఈసారైనా విజయదాహార్తిని తీర్చే ఆటగాళ్లను కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.  


కాస్తలో చేజారిన కప్‌

గత మూడేళ్లుగా అనుభవజ్ఞులు, యువ ప్లేయర్లతో నిలకడైన ప్రదర్శన చేస్తున్న జట్లలో దిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. ఐపీఎల్‌ - 2020లో ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన దిల్లీ అక్కడ మాత్రం బోల్తా పడింది. అప్పుడు శ్రేయస్‌ అయ్యర్ జట్టును నడిపాడు. అయితే శ్రేయస్‌ను తర్వాతి సీజన్‌కు కెప్టెన్సీ నుంచి తప్పించిన దిల్లీ యాజమాన్యం రిషభ్‌ పంత్‌ను సారథిగా నియమించింది. పంత్ నాయకత్వంలో 14వ సీజన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. అయితే ఒత్తిడి తట్టుకోలేక క్వాలిఫయర్స్‌లో చెన్నై, కేకేఆర్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో శ్రేయస్‌ను రిటెయిన్‌ చేసుకోకుండా.. రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, నార్జే, పృథ్వీ షాను అట్టిపెట్టుకుంది. సీనియర్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ అశ్విన్‌తో సహా హెట్‌మెయిర్ వంటి హిట్టర్‌ను వదిలేసుకుంది. వీరిని మెగా వేలంలో కొనుగోలు  చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని