IPL: ముంబయి ఇండియన్స్‌కు తగ్గిన క్రేజ్‌.. పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ

ఈసారి ఐపీఎల్‌ బ్రాండ్ విలువ 6.3 శాతం పెరిగిందని.. ముంబయి ఇండియన్స్‌ టీమ్ బ్రాండ్ విలుత తగ్గిందని ఓ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

Published : 13 Jun 2024 19:04 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL)లో గత కొన్ని సీజన్ల నుంచి ముంబయి ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ ఏడాది ఘోరమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు అత్యధిక బ్రాండ్ విలువ కలిగిఉన్న ముంబయి ఫ్రాంఛైజీ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడమే ఇందుకు కారణం. అంతేకాకుండా రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తొలగించి హార్దిక్ పాండ్యను సారథిగా నియమించడం కూడా ప్రభావం చూపింది. తాజాగా హౌలిహాన్ లోకీ సంస్థ ఐపీఎల్‌ జట్ల బ్రాండ్ విలువలను ప్రకటించింది. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) గతేడాది కంటే 9% వృద్ధిని సాధించింది. సీఎస్కే (231 మిలియన్‌ డాలర్లు) అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న జట్టుగా నిలిచింది. 2024 సీజన్‌ చివర్లో సంచలన విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌ చేరిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన బ్రాండ్ విలువ తగ్గకుండా కాపాడుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ (227 మిలియన్ డాలర్లు) రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్రాండ్ విలువ ఏకంగా 19.30% వృద్ధిని సాధించింది. కేకేఆర్ (216 మిలియన్‌ డాలర్లు) మూడో స్థానంలో నిలిచింది. ముంబయి ఇండియన్స్ (204 మిలియన్‌ డాలర్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ (133 మిలియన్‌ డాలర్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్‌ డాలర్లు), దిల్లీ క్యాపిటల్స్‌ (131 మిలియన్‌ డాలర్లు), గుజరాత్ టైటాన్స్ (124 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్ (101 మిలియన్ డాలర్లు), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (91 మిలియన్ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ 

ఐపీఎల్ బ్రాండ్ విలువ గతేడాది కంటే 6.3 శాతం (రూ.28, 000 కోట్లు) పెరిగిందని హౌలిహాన్ లోకీ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైంది. గతేడాది ఈ మెగా టోర్నీ బ్రాండ్ విలువ 3.2 మిలియన్‌ డాలర్లు ఉండగా ఈ ఏడాది 3.4 మిలియన్ డాలర్లకు చేరింది. వ్యాపార పరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువ 6.5 శాతం పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు (16.4 బిలియన్‌ డాలర్లు) చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని