Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా విజయం.. సిరీస్ కైవసం

యువ భారత్ మెరిసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0 సిరీస్‌ని కైవసం చేసుకుంది. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. స్టిర్లింగ్ (40; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు),

Updated : 29 Jun 2022 01:15 IST

డబ్లిన్‌: యువ భారత్ మెరిసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0 సిరీస్‌ని కైవసం చేసుకుంది. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఉమ్రాన్ మాలిక్‌ తెలివిగా బౌలింగ్ చేసి  జట్టుకు విజయాన్ని అందించాడు. స్టిర్లింగ్ (40; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాల్ బిర్నీ (60; 37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. డెలానీ (0) రనౌట్ అయ్యాడు. టకర్ (5)ని ఉమ్రాన్‌ మాలిక్‌ ఔట్‌ చేసి అంతర్జాతీయ టీ20ల్లో వికెట్ల ఖాతాని తెరిచాడు. హ్యారీ టెక్టార్‌ (39; 28 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. డాక్రెల్ (34; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అడైర్‌ (23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ తలో వికెట్ తీశారు. సెంచరీ అలరించిన దీపక్‌ హుడా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులను గెల్చుకున్నాడు. 

దీపక్, సంజూ.. ధనాధన్‌

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (104; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక్కొట్టగా.. సంజూ శాంసన్ (77; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు)  అర్ధ శతకంతోచెలరేగాడు. ఇషాన్‌ కిషన్‌ (3) నిరాశ పర్చాడు. మార్క్ అడైర్ వేసిన 16.2 ఓవర్‌కు శాంసన్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. లిటిల్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (15), దీపక్‌ హుడా పెవిలియన్ చేరారు.  లిటివ్‌ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్‌ (0), అక్షర్‌ పటేల్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. అడైర్‌ వేసిన చివరి ఓవర్లో హర్షల్ పటేల్ (0) కూడా డకౌట్‌ అయ్యాడు. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్ 3, లిటిల్ 2, యంగ్ 2 వికెట్లు పడగొట్టారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని