Prithvi Shaw: భారత ఓపెనర్‌గా పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్‌ పఠాన్‌

రంజీల్లో అద్భుతంగా రాణించే బ్యాటర్‌ పృథ్వీషా కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. కానీ అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీనిపై స్పందించిన మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌పఠాన్‌.. షాకు భారత ఓపెనర్‌గా అవకాశాలు ఇవ్వాలని తెలిపాడు.

Published : 04 Feb 2023 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రంజీల్లో అద్భుతంగా రాణించే బ్యాటర్‌ పృథ్వీషాకు భారత ఓపెనర్‌గా అవకాశాలు ఇవ్వాలని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌పఠాన్‌ అన్నాడు. అతడికి సుదీర్ఘకాలం అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు. షా, శుభ్‌మన్‌ గిల్‌ ఇద్దరూ కలిసి ఓపెనింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుందన్నాడు. భారత్‌ - న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో పృథ్వీషాకు చోటు దక్కింది. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం.  తాజాగా దీనిపై ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు.

‘‘కివీస్‌తో మూడో టీ20 సందర్భంగా మైదానంలో ఉన్న అభిమానులు పృథ్వీషా ప్రదర్శన కోసం ఎదురుచూశారు. మీరు అతడిని జట్టులోకి ఎంపిక చేసి సుదీర్ఘకాలం అవకాశాలు ఇవ్వండి. అంటే కేవలం ఒక మ్యాచ్‌కే పరిమితం చేయకుండా సిరీస్‌ ముగిసే వరకు అతడిని జట్టులో భాగస్వామ్యం చేయండి. ముఖ్యంగా సిరీస్‌ను తేల్చే మ్యాచుల్లో తప్పకుండా తీసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఇషాన్‌ కిషన్‌ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయట్లేదు. అతడు వికెట్‌ కీపర్‌ కూడా. అందువల్ల ఇషాన్‌కి ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు. పృథ్వీషాకి ఒకసారి అవకాశం వస్తే దాన్ని అస్సలు వదులుకోడు. మరోవైపు స్థిరంగా ఆడే శుభ్‌మన్‌ గిల్‌ ఉన్నాడు కాబట్టి జట్టు కాంబినేషన్‌ బాగుంటుంది. షా స్ట్రైక్‌ రేట్‌ గొప్పగా ఉంది. అతడు అద్భుతంగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని