Irfan Pathan: పాక్‌ ప్రధాని ట్వీట్‌కు ఇర్ఫాన్‌ పఠాన్‌ దీటైన కౌంటర్

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు ఆట తీరును విమర్శిస్తూ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనికి స్పందించిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ దాయాదికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 12 Nov 2022 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమ్‌ఇండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో పాక్‌ మాజీ ఆటగాళ్లు భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. దొరికిన అవకాశాన్ని వాడుకుంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా టీమ్‌ఇండియాను విమర్శిస్తూ చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందిస్తూ.. దాయాదికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇతరుల ఇబ్బందుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారంటూ దుయ్యబట్టారు.

సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ మ్యాచ్ అనంతరం పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ట్విటర్ వేదికగా టీమ్‌ఇండియాపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘152/0 vs 170/0’’ అని ట్వీట్ చేశారు. 152/0 అంటే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఛేదనలో పాక్‌ చేసిన స్కోరు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌పై వికెట్‌ కోల్పోకుండా విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఈ సారి ఫైనల్‌లో తలపడుతున్నాయన్న అర్థంలో.. భారత్‌ను విమర్శిస్తూ పాక్‌ ప్రధాని ఈ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై భారత అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాక్‌ ప్రధాని విమర్శలపై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌ వేదికగా గట్టిగా బదులిచ్చారు. ‘‘భారత్‌కు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా ఇదే. మేం మాపట్ల ఆనందంగానే ఉన్నాం. కానీ మీరు పొరుగువారి బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అందుకే, మీ దేశం పట్ల, మీ ప్రజల బాగోగుల పట్ల మీరు దృష్టి సారించలేకపోతున్నారు’’ అని పఠాన్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని