IND vs AUS: స్టీవ్‌ స్మిత్‌ని ఆ స్పిన్నర్‌ ఇబ్బందిపెడతాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

భారత్, ఆసీస్‌  (IND vs AUS) మధ్య త్వరలో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith)ని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఇబ్బందిపెడతాడని భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు.

Published : 05 Feb 2023 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్ స్మిత్‌ (Steve Smith)ను భారత స్నిన్నర్‌ అక్షర్ పటేల్ ఇబ్బంది పెడతాడని టీమ్‌ఇండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డాడు. స్మిత్‌ మంచి ఆటగాడని, అతడిని ఎదుర్కొనేందుకు భారత్‌ సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించాడు. ఫిబ్రవరి 9 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ కోసం ఆసీస్‌ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుంది. బెంగళూరు సమీపంలోని ఓ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తోంది. భారత స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఎక్కువగా స్పిన్‌ బౌలింగ్‌లో సాధన చేస్తున్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు.  

‘స్టీవ్‌ స్మిత్‌ ఆస్ట్రేలియన్‌ లెజెండ్‌. అందులో సందేహం లేదు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు భారత బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. అతడిని ఎదుర్కొనేందుకు మన (భారత్‌) వద్ద సరైన ప్రణాళిక ఉండాలి. స్టీవ్ స్మిత్ నుంచి టీమ్‌ఇండియాకు సవాలు ఉంటుంది. కానీ, భారత స్పిన్నర్ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) నుంచి స్మిత్‌కు ముప్పు ఉంది. అక్షర్‌ స్టీవ్‌ స్మిత్‌కి క్రమం తప్పకుండా లైన్ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే అతడు వికెట్ల ముందు దొరికిపోవడం లేదా బౌల్డ్‌ అవుతాడు. ఎందుకంటే స్మిత్‌ తన కుడిచేతిని ఎక్కువగా ఉపయోగిస్తాడు’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని