Irfan Pathan: కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం లేదు.. జట్టులో చేయాల్సిన మార్పులివే : ఇర్ఫాన్‌ పఠాన్‌

టీ20 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం నేపథ్యంలో భారత జట్టులో మార్పులు చేపట్టి.. సమూల ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరైతే.. కెప్టెన్‌ను మార్చాలంటూ కోరుతున్నారు.

Updated : 16 Nov 2022 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇంగ్లాండ్‌పై దారుణ ఓటమితో పొట్టి ప్రపంచకప్‌ నుంచి భారత్‌ అవమానకరరీతిలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. జట్టులో మార్పులు చేపట్టి.. సమూల ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరైతే.. టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చాలంటూ సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. సారథిని మార్చాల్సిన అవసరం లేదని.. జట్టులో తీసుకురావాల్సిన మార్పులపై ‘4 పాయింట్‌ ఫార్ములా’తో పఠాన్‌ ముందుకు వచ్చాడు. ఈ మేరకు ట్వీట్‌ చేశాడు.

భారత క్రికెట్‌ ముందుకెళ్లాలంటే..
1.ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడాలి. కనీసం ఒక్కరైనా అలా బ్యాటింగ్‌ చేయాలి.
2. వికెట్లు తీసే మణికట్టు స్పిన్నర్‌ జట్టులో కచ్చితంగా ఉండాలి.
3. దుర్భేద్యమైన ఫాస్ట్‌బౌలర్‌ అవసరం.
4. కెప్టెన్సీ మార్పుపై దయచేసి ఆలోచన చేయొద్దు. అది ఫలితాన్ని ఇస్తుందని భావించొద్దు.. అని పఠాన్‌ సూచించాడు.

2024 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని పలువురు సూచిస్తున్నారు. అయితే.. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడంలో ఉన్న రిస్క్‌ను పఠాన్‌ వివరించాడు. ‘ఈ ఆల్‌రౌండర్‌కు గాయాలు లేని చరిత్ర లేదు. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నమెంట్‌ ముందు అతడు గాయపడితే.. టీమ్‌ చుట్టూ భయాలు నెలకొంటాయి. అప్పుడు సారథికి సంబంధించి మరో ఆప్షన్‌ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి’ అంటూ పఠాన్‌ ఓ క్రీడాఛానల్‌తో విశ్లేషించాడు. అందుకే కెప్టెన్‌ను మార్చితే.. ఫలితాలు మారతాయని తాను అనుకోవడం లేదని వివరించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు