Olympic Games: పారిస్‌ సిద్ధమేనా?

ఓ వైపు దేశంలో రాజకీయ అనిశ్చితి.. ఇంకా ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం.. మరోవైపు ఒలింపిక్స్‌ నిర్వహణపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి.. ఇంకో వైపు ఒలింపిక్స్‌కు ప్రధాన ఆకర్షణ అయిన సెన్‌ నదిలోని నీటి నాణ్యతపై ఆందోళన.. ఇలా సవాళ్ల నడుమ ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం పారిస్‌ సిద్ధమవుతోంది. 

Published : 11 Jul 2024 03:35 IST

ఈనాడు క్రీడావిభాగం

ఓ వైపు దేశంలో రాజకీయ అనిశ్చితి.. ఇంకా ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం.. మరోవైపు ఒలింపిక్స్‌ నిర్వహణపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి.. ఇంకో వైపు ఒలింపిక్స్‌కు ప్రధాన ఆకర్షణ అయిన సెన్‌ నదిలోని నీటి నాణ్యతపై ఆందోళన.. ఇలా సవాళ్ల నడుమ ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం పారిస్‌ సిద్ధమవుతోంది. 

రోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడి 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అభిమానుల సందడి లేకుండా పోయింది. ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించకపోవడమే అందుకు కారణం. 1900, 1924లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఫ్రాన్స్‌.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మరోసారి ఈ క్రీడలకు వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్‌లో ప్రవహించే సెన్‌ నది ఈ ఒలింపిక్స్‌కు ప్రధాన ఆకర్షణ కానుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ క్రీడల ఆరంభోత్సవ వేడుకలు స్టేడియంలో కాకుండా తొలిసారి ఆరుబయట నదిలో జరగబోతున్నాయి. వీటితో పాటు మారథాన్‌ స్విమ్మింగ్, ట్రయథ్లాన్‌ స్విమ్మింగ్‌ తదితర ఓపెన్‌ వాటర్‌ స్విమ్మింగ్‌ పోటీలకు సెన్‌ వేదిక కానుంది. కానీ ఇందులోని నీటి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉండటం నిర్వాహకుల ప్రణాళికలను దెబ్బతీసేదే. వరద, మురికి నీరు కారణంగా ఈ నదిలో 1923 నుంచి స్నానం చేయడంపై నిషేధం ఉంది. ఇప్పటికీ ఇందులో ఈత కొట్టడం అథ్లెట్లకు శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఒకవేళ పోటీల సమయానికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్‌ నిర్వహించే అవకాశముంది. ఆరంభ వేడుకల సందర్భంగా ఉగ్రముప్పు పొంచి ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ప్రేక్షకుల సంఖ్యను 6 లక్షల నుంచి 3 లక్షలకు తగ్గించారు.

ఇంకా సందిగ్ధతే..

పార్లమెంట్‌ను రద్దు చేస్తూ గత నెలలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ తీసుకున్న నిర్ణయంతో అక్కడి పరిస్థితి భిన్నంగా మారింది. రెండు దఫాల ఎన్నికల్లో ఏ పార్టీకి ఆధిక్యత రాకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొనడం క్రీడల నిర్వహణపై ప్రభావం చూపేదే. 44 శాతం పారిస్‌ ప్రజలు ఒలింపిక్స్‌ నిర్వహణ సరైన నిర్ణయం కాదని గత నెలలో అభిప్రాయపడ్డారు.వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవిలో పారిస్‌లో సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాలు అథ్లెట్లకు ఇబ్బంది కలిగించేవే. ఉచిత ప్రజారవాణా సౌకర్యం కల్పిస్తామని, ఒలింపిక్‌ వేదికల వరకూ మెట్రో పొడిగిస్తామని ఒలింపిక్స్‌ కోసం బిడ్‌ దాఖలు చేసినప్పుడు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ప్రజా రవాణా ఛార్జీలు రెండింతలు పెరిగాయి. మెట్రో సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమస్యల మధ్య ఒలింపిక్స్‌ను పారిస్‌లో ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని