Rohit - Kohli: వన్డే.. టీ 20 కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌ శర్మకేనా? 

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా చేస్తారా... 

Published : 08 Nov 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20ల్లో టీమిండియా కొత్త కెప్టెన్‌ (india captian) ఎవరు? - చాలా రోజులుగా భారత క్రికెట్‌లో నలుగుతున్న ప్రశ్న. దీనికి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్‌ శర్మ (Rohit Sharma)కే ఎక్కువ అవకాశాలున్నాయని క్రికెట్‌ పరిశీలకులు చెబుతున్నారు. అయితే రోహిత్‌ కేవలం టీ20లకే కాదు... వన్డేలకు కూడా కెప్టెన్‌ అవుతాడనేది కొత్త మాట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ఇప్పటికే విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ప్రకటించిన విషయం తెలిసిందే.

విరాట్‌  కేవలం టీ20 కెప్టెన్సీ నుంచే తప్పుకుంటానని అప్పుడు చెప్పాడు. అయితే జట్టు యాజమాన్యం అతనిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించబోతోంది అంటున్నారు. ఈ మేరకు కొన్ని క్రికెట్‌ వెబ్‌సైట్లు బీసీసీఐ  (BCCI) వర్గాల భోగట్టా అని రాస్తున్నాయి. టీ20లకు కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేసి, వన్డేలకు వేరొకరిని నాయకుడిగా ఎంచుకునే ఆలోచన బీసీసీఐకి లేదట. కారణం భారత జట్టులో మూడు ఫార్మాట్లు, ముగ్గురు కెప్టెన్ల కాన్సెప్ట్‌ ఇంతవరకు చూడలేదు. అది జట్టుకు అంత మంచి కూడా చేయదు. అచ్చంగా ఈ కారణంగానే వన్డేలకు రోహిత్‌ను కెప్టెన్‌ను చేయాలని చూస్తున్నారట. 

వన్డేల్లోనూ బ్యాటర్‌గా విరాట్‌ ప్రదర్శన ఇటీవల కాలంలో ఆశించినంతగా లేదు. దీంతో ఆ కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కోహ్లీకి కెప్టెన్సీ బరువు తగ్గించి బ్యాటింగ్‌ మీద దృష్టి పెట్టే అవకాశం ఇస్తే బాగుంటుందని బీసీసీఐ అనుకుంటోందట. త్వరలో జరగబోయే సెలక్టర్ల సమావేశంలో ‘రోహిత్‌కు కెప్టెన్సీ’ విషయంలో నిర్ణయం తీసుకుంటారట. అయితే బీసీసీఐ పరిశీలనలో కేఎల్‌ రాహుల్‌ (K L Rahul), రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) పేర్లు ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ టీ20, వన్డే కెప్టెన్సీ అయితే సీనియారిటీకి ప్రాముఖ్యత ఇచ్చి... రోహిత్‌కే పట్టం కట్టొచ్చు. మరోవైపు కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా రోహిత్‌కి కెప్టెన్సీ అప్పగించడంపై సుముఖంగా ఉన్నాడని టాక్‌.

ఇందుకేనా నిర్ణయం...

పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉందట. రాబోయే రెండేళ్లలో రెండు ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి.  2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. 2023లో మన దేశంలో వన్డే ప్రపంచకప్‌ జరుగుతుంది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌ను ఎంపిక చేస్తున్నారట. ఇప్పటి నుంచి జట్టు కూర్పును పక్కా చేసుకుంటేనే ఆ ఈవెంట్లలో మన జట్టు నుంచి మంచి ఫలితం ఆశించొచ్చు. విరాట్‌ నేతృత్వంలో ఐసీసీ ఈవెంట్లలో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. 

భారత కెప్టెన్‌ ఎంపిక విషయంలో బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. త్వరలో జరగబోయే సెలక్టర్ల సమావేశంలో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని