Rohit Sharma: ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుతుందా?.. గణాంకాలు ఏం చెబుతున్నాయ్‌?

భారత టీ20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది...

Updated : 16 Apr 2022 13:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే, అంత గొప్ప రికార్డున్న ముంబయి గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా ఇంటి ముఖం పట్టగా.. ఈసారి మరింత దారుణంగా తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. ఇక్కడ నెట్‌ రన్‌రేట్‌ కూడా (-1.072) మైనస్‌లో ఉండటం ఆ జట్టు పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది ముంబయి అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ముంబయి ప్లేఆఫ్స్‌ చేరుతుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా జట్లన్నీ (చెన్నై మినహా) రెండు మూడు ఓటములు తప్ప బాగానే ఆడుతున్నాయి. దీంతో ప్లేఆఫ్స్‌ రేసులో ఎవరు నిలుస్తారనేది చెప్పడం చాలా కష్టంగా మారింది. అలాంటప్పుడు ముంబయి నాకౌట్‌ దశకు చేరుకునే అవకాశాలు కూడా మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఊరటగొలిపే ఒక్క విషయం.. ముంబయి ఇప్పటికీ ప్లేఆఫ్స్‌ చేరే వీలుంది. ఇకపై ఆడాల్సిన 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 8 విజయాలు సాధిస్తే 16 పాయింట్లతో నాకౌట్‌కు చేరే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యే సమయానికి ఇతర జట్లు ఏవైనా అన్నే పాయింట్లు సాధిస్తే అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఉంటేనే.. ముంబయి ప్లేఆఫ్స్‌ చేరుతుంది. కానీ, ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన తీరు చూస్తుంటే అది కష్టంగా అనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముంబయి ఏదైనా అద్భుతం చేసి టాప్‌ నాలుగులో నిలుస్తుందో లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని