క్రికెటర్‌ పేరెందుకు పెట్టరో మరి!

క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే వేదిక ‘స్టేడియం’. గల్లీ క్రికెటర్లు అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగేందుకు అదే భూమిక. రకరకాల పిచ్‌లు, సీటింగ్‌ స్టాండ్లు, డ్రస్సింగ్‌ రూమ్‌లు, ఆహార కేంద్రాలకు అది నెలవు. సొగసరి స్ట్రోక్‌ప్లే, కళాత్మక విధ్వంసాలు, సర్రున దూసుకెళ్లే బంతులు, అబ్బుర పరిచే క్యాచులు, హోరాహోరీ పోరాటాలకు అది కాణాచి....

Updated : 27 Feb 2021 09:52 IST

ఆటగాళ్ల పేర్లతో స్టేడియాలు ఎన్నంటే?

క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే వేదిక ‘స్టేడియం’. గల్లీ క్రికెటర్లు అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగేందుకు అదే భూమిక. రకరకాల పిచ్‌లు, సీటింగ్‌ స్టాండ్లు, డ్రస్సింగ్‌ రూమ్‌లు, ఆహార కేంద్రాలకు అది నెలవు. సొగసరి స్ట్రోక్‌ప్లే, కళాత్మక విధ్వంసాలు, సర్రున దూసుకెళ్లే బంతులు, అబ్బుర పరిచే క్యాచులు, హోరాహోరీ పోరాటాలకు అది కాణాచి. కానీ అదేం విచిత్రమో! దిగ్గజాలెందరినో అందించిన స్టేడియాలకు వారి పేర్లు పెట్టడం తక్కువే. నాయకులు, నగరాల పేర్లే ఎక్కువే. ఎందుకిలా?


(Images: Getty, Twitter)

రెండు వర్గాలూ ముఖ్యమే

ఎక్కడైనా సరే క్రికెట్‌ అభివృద్ధికి రెండు వర్గాలు తోడ్పాటు అందిస్తాయి. అందులో ఒక వర్గం ఆటగాళ్లదైతే మరో వర్గం పాలకులది. ఈ రెండు వర్గాలు సమన్వయంతో సాగితేనే ఆట అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా క్రికెటర్లు స్టేడియం నిర్మాణాలు, పిచ్‌ల రూపకల్పన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరుల గురించి పట్టించుకోవడం కష్టం. వారి ప్రధాన లక్ష్యం ఆటలో ముందుకు సాగడమే. అభిమానులను అలరించడమే. మరి వారికి అవసరమైన మౌలిక వసతులు, క్రికెట్‌ పాలన చూసుకోవాల్సింది పాలకులే. సిరీసులు, పోటీల నిర్వహణ, ఆర్థిక వనరుల సమీకరణ, జీతభత్యాల చెల్లింపులు, ఆటగాళ్ల ఎంపిక, కోచ్‌లు, సహాయకుల ఎంపిక వంటి బాధ్యతా వారిదే. దివంగత అరుణ్‌ జైట్లీ దిల్లీ క్రికెట్‌ సంఘంలో కీలక పాత్ర పోషించడమే ఇందుకు ఉదాహరణ. అందుకే ఈ రెండు వర్గాల్లో ఎక్కువ తక్కువలకు తావులేదు!


మోదీ పేరుతో చర్చ

మొతేరాలో లక్షాపదివేల సీటింగ్‌ సామర్థ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మించారు. దానికి ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టడంతో క్రికెటర్ల పేరెందుకు పెట్టడం లేదన్న చర్చ మొదలైంది. నిజానికి భారత్‌లో క్రికెటర్ల పేరుతో ఒక్క స్టేడియమూ లేదు. అంతర్జాతీయంగా చూసుకున్నా అంతే. వెస్టిండీస్‌లో తప్ప మిగతా క్రికెటింగ్‌ దేశాల్లో పేర్లన్నీ నాయకులు, నదులు, ప్రాంతాల నేపథ్యంలో పెట్టినవే. అయితే ఇది క్రికెటర్ల తక్కువ చేయడమేనని చెప్పలేం. ఎందుకంటే దిగ్గజ క్రికెటర్ల పేర్లతో అంతర్జాతీయ సిరీసులెన్నో ఉన్నాయి. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఇందుకు ఉదాహరణ. ఇక అనేక దేశాల్లో తమ క్రికెటర్ల గౌరవార్థం, స్మార్థకార్థం స్టేడియాల్లోని స్టాండ్లకు వారి పేర్లు పెట్టారు. కొన్నిచోట్ల స్టేడియం ద్వారాలకూ నామకరణం చేశారు. సచిన్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, కుంబ్లే, ధోనీ, గంభీర్‌ సహా ఎందరి పేర్లతోనే స్టాండ్లు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.


నెహ్రూ పేరుతో 9 స్టేడియాలు

రాజకీయ నాయకులు, క్రికెట్‌ పాలకుల పేర్లతో ఎక్కువ స్టేడియాలున్నది మాత్రం భారత్‌ వంటి ఆసియా దేశాల్లోనే. దాదాపుగా మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పేరుతో మన దేశంలో తొమ్మిది స్టేడియాలు ఉన్నాయి. గువాహటి, దిల్లీ, విజయవాడలో ఇందిరాగాంధీ పేర్లతో ఉన్నాయి. హైదరాబాద్‌, దెహ్రాదూన్‌, కోచిలో రాజీవ్‌గాంధీ పేర్లు పెట్టారు. నదౌన్‌, లక్‌నవూలోని స్టేడియాలకు వాజ్‌పేయ్‌ అని నామకరణం చేశారు. ఫిరోజ్‌షా కోట్లా పేరును అరుణ్‌జైట్లీగా మార్చారు. కోళికోడ్‌ స్టేడియానికి కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ పేరు పెట్టారు. బెంగళూరులో ఎం.చిన్నస్వామి, చెన్నైలో చిదంబరం, మొహాలిలో ఐఎస్‌ బింద్రా పేర్లు పెట్టారు. వీరంతా అక్కడి క్రికెట్‌ పాలకులు కావడం గమనార్హం.


ఆసియా దేశాల్లో రాజకీయ హవా

ఆసియా దేశాలైన పాక్‌, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్‌లోనూ రాజకీయ నాయకుల పేర్లే ఎక్కువ. పాక్‌లో గడాఫీ, జిన్నా, ఆయుబ్‌, ఇక్బాల్‌, జాఫర్‌ అలీ పేర్లతో స్టేడియాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో దాదాపుగా అన్నింటికీ వ్యక్తుల పేర్లే పెట్టడం గమనార్హం. అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం పాలకుడి పేరుతో కట్టిందే. ఇక దుబాయ్‌, షార్జా స్టేడియాలకు ప్రాంతాల పేర్లు వచ్చాయి. అందమైన స్టేడియాలకు నెలవైన శ్రీలంకలోనూ రాజకీయ నాయకుల పేర్లే ఎక్కువ. హంబన్‌తోటలోని మహిందా రాజపక్స, కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియాలే ఇందుకు ఉదాహరణ. ఇక కొలంబో, గాలె, దంబుల్లా, పల్లెకెలె వంటివి ప్రాంతాల, సాంస్కృతిక కేంద్రాల నేపథ్యంలో పెట్టినవి.


విండీస్‌లో మాత్రమే

స్టేడియాలకు పేర్లు పెట్టడంలో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వైవిధ్యం ప్రదర్శించాయి! అంతర్జాతీయ క్రికెటర్లైన సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, డారెన్‌ సామి పేర్లను సెయింట్‌ లూసియా, ఆంటిగ్వా ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. ఇక కెన్నింగ్‌టన్‌ ఓవల్‌, క్వీన్స్‌పార్క్‌, సబీనా పార్క్‌ వంటివి ప్రాంతాల నేపథ్యంలో పెట్టిన పేర్లు. దిగ్గజ క్రికెటర్‌ సర్‌ బ్రాడ్‌మన్‌ పేరుతో ఆస్ట్రేలియాలో రెండు చిన్న స్టేడియాలు ఉన్నా వాటిల్లో అంతర్జాతీయ స్థాయి మ్యాచులు ఒక్కటీ  జరగలేదు. అయితే సిడ్నీ, మెల్‌బోర్న్‌, గబ్బా వంటి ప్రఖ్యాత మైదానాలకు ప్రాంతాల పేర్లే రావడం గమనార్హం. న్యూజిలాండ్‌లోనూ అంతే. ఇక ఇంగ్లాండ్‌లోని ప్రతి స్టేడియం పేరు ఏదో ఒక ప్రాంతం, కౌంటీ, వ్యాపార వీధుల నుంచే పెట్టడం ప్రత్యేకం. దక్షిణాఫ్రికాలోనూ ఇదే పరిస్థితి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని