Ishan Kishan: నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్‌

ఆరు నెలలుగా చాలా కుంగుబాటుకు గురైనట్లు ఇషాన్‌ కిషన్‌ వెల్లడించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి ఉద్వాసన మొదలు జాతీయ జట్టులో చోటు కోల్పోవడం వరకు ప్రతిదీ బాధపెట్టిందని తెలిపాడు.

Published : 07 Jul 2024 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు (Ishan Kishan cricketer) ఈ ఏడాది పెద్ద షాక్‌ తగిలింది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బీసీసీఐ అతడిని తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టులోకి రావాలంటే తలుపులు మూసుకుపోయాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాక.. మళ్లీ టీమ్‌లోకి రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాలనే బీసీసీఐ నిబంధనను పాటించకపోవడంతోనే వేటు పడిందనే వార్తలు వచ్చాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల కుంగుబాటుకు గురైన తనకు విశ్రాంతి కావాలని గతేడాది చివర్లో బీసీసీఐకి (BCCI) ఇషాన్‌ విన్నవించుకున్నాడు. అనుమతి తీసుకున్నాక దుబాయ్‌ వెళ్లి పార్టీల్లో పాల్గొనడం మేనేజ్‌మెంట్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దేశవాళీలో ఆడాలని సూచించినా.. ఇషాన్‌ పెడచెవిన పెట్టి ఐపీఎల్‌ కోసం సిద్ధమవడంతో కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) స్పందించాడు. 

‘‘ఇలాంటి విషయాల గురించి నేనెప్పుడూ బాధపడను. నా సత్తా ఏంటో నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తా. గత ఆరు నెలలుగా చాలా డిప్రెషన్‌కు గురయ్యా. ఇప్పుడు అంతా బాగుందని చెప్పలేను. చాలా కష్టంగా ఉంది. ఏమైంది? ఏం జరిగింది? అని చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. నాకే ఎందుకు? అని ఆవేదన ఉంటుంది. నేను ఉత్తమ ప్రదర్శన చేస్తున్నప్పుడే ఇలా జరగడం మరింత బాధించే అంశం. నేను భారీగా పరుగులు చేస్తూనే ఉన్నా సరే ఎక్కువగా బెంచ్‌పైనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. జట్టుగా ఉన్నప్పుడు తప్పదు. కానీ, ఎక్కువగా ప్రయాణాలతో కుంగుబాటుకు గురయ్యా. ఎక్కడో తేడాగా ఉందనిపించింది. దీంతో విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు మినహా.. ఎవరూ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. 

ఎప్పుడైనా సరే విరామం తీసుకోవడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే, మళ్లీ జట్టులోకి రావాలంటే మాత్రం దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన చేయాలనేది నిబంధన. కానీ, నా విషయంలో సమస్యే విభిన్నం. నన్ను మళ్లీ దేశవాళీలో ఆడమనడమే సమంజసంగా అనిపించలేదు. నేను క్రికెట్‌ ఆడలేని పరిస్థితుల్లో ఉండబట్టే కదా అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి బ్రేక్‌ తీసుకున్నా. అలాంటప్పుడు దేశవాళీలో పాల్గొనాలని చెప్పడం సరైందేనా? గేమ్‌ను ఆడేంత పరిస్థితి ఉంటే విరామం తీసుకోకుండా జాతీయ జట్టుకే ఆడేవాడిని’’ అని ఇషాన్‌ కిషన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని