Ishan Kishan: టెస్టుల్లోకి పిలుపు.. మా నాన్న అలా అన్నారు: ఇషాన్‌ కిషన్

టీమ్‌ఇండియా (Team India) యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan)కు తొలిసారిగా టెస్టుల్లోకి ఆహ్వానం అందింది. ఆసీస్‌తో (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో స్థానం దక్కింది.

Updated : 17 Jan 2023 15:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీ బాదిన క్రికెటర్‌ టీమ్‌ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌. గతేడాది బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. అయితే ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి. ఎక్కువగా బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి  మ్యాచ్‌ ఆడేందుకు కిషన్ హైదరాబాద్‌లోనే ఉన్నాడు. అంతేకాకుండా వచ్చే నెల ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన స్క్వాడ్‌లోనూ చోటు సంపాదించాడు. అయితే తుది జట్టులోకి వస్తాడా..? లేదా..? అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి. కానీ టెస్టు జట్టులోకి రావడంపై ఇషాన్ కిషన్ ఆనందం వ్యక్తం చేశాడు.

టెస్టుల్లో ఆడాలనే కోరిక తీరితే బాగుంటుందని, అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని ఇషాన్‌ తెలిపాడు. టెస్టు జట్టులోకి ప్రకటించిన తర్వాత తన కుటుంబ సభ్యుల స్పందనేంటో కూడా చెప్పాడు. శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘చాలా సంతోషంగా ఉంది. వన్డేలు, టీ20ల్లో రాణించిన ప్రతిసారి మా నాన్న ఒకటే చెబుతుంటారు. టెస్టు క్రికెట్టే అసలైన గేమ్‌. కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రికెటర్‌ నైపుణ్యాలకు పరీక్ష కూడా టెస్టుల్లోనే ఎదురువుతుంది. ఎట్టకేలకు టెస్టు జట్టులోకి రావడం మాత్రం ఆనందంగా ఉంది. ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. నాకు టెస్టుల్లోకి పిలుపు వచ్చినప్పుడు.. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావో అలాగే కష్టపడాలని మా నాన్న చెప్పారు’’

‘‘టెస్టుల్లో బ్యాటింగ్‌కు దిగే స్థానంపై ఎలాంటి ఆలోచన లేదు. ఎప్పుడు వచ్చినా సరే పరిస్థితిని అర్థం చేసుకొని ఆడాలి. మిడిలార్డర్‌లో వెళ్తే కొన్నిసార్లు భారీ షాట్లు కొట్టాల్సి ఉంటుంది. వైట్‌ బాల్‌, రెడ్ బాల్‌ క్రికెట్‌కు ఉన్న ప్రధాన తేడా స్వింగ్‌ కావడం. తెల్ల బంతి ఎక్కువగా స్వింగ్‌ కాదు. అదే ఎర్ర బంతి మాత్రం బ్యాటర్‌కు కఠిన పరీక్ష పెడుతుంది. అత్యుత్సాహం అక్కడ పనికిరాదు’’ అని ఇషాన్‌ కిషన్ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని