Cricket: ఇషాన్‌ సిక్స్ వెనుక సీక్రెట్‌ ఇదే!

సంజు శాంసన్ గాయంతో వన్డే అరంగేట్రానికి అవకాశం దక్కించుకున్న వికేట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో శుభారంభం చేసిన భారత యు....

Published : 20 Jul 2021 01:48 IST

(ఫొటో: ఇషాన్‌ కిషన్‌ ట్విటర్‌)

కొలంబో: సంజు శాంసన్ గాయంతో వన్డే అరంగేట్రానికి అవకాశం దక్కించుకున్న వికేట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో శుభారంభం చేసిన భారత యువ జట్టులో ఇషాన్‌ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. తన కంటే ముందు పృథ్వీ షా పారించిన పరుగుల వరదను నిరాటంకంగా కొనసాగించాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి.. తర్వాత బంతిని బౌండరీలోకి బాది క్రీజులో కుదురుకున్నాడు.

ఆట అనంతరం చాహల్‌తో కలిసి ‘చాహల్‌ టీవీ’తో మాట్లాడిన ఇషాన్‌.. తొలి బంతినే సిక్స్‌గా మలచడం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. 50 ఓవర్లపాటు కీపింగ్‌ చేసిన తనకు పిచ్‌ స్పిన్నర్లకు సహకరించడంలేదన్న విషయం బోధపడిందని తెలిపాడు. దీన్ని సదవకాశంగా భావించానన్నాడు. దీంతో బౌలర్‌ తొలి బంతిని ఎక్కడ వేసినా.. దాన్ని సిక్స్‌గా మలచాలని ముందే నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని డ్రెస్సింగ్‌ రూంలో ఆటగాళ్లతో ముందే చెప్పినట్లు వెల్లడించాడు. పైగా ఆదివారం తన పుట్టినరోజు కూడా అని తెలిపాడు. ఈ అంశాలన్నీ తొలి బంతిని సిక్స్‌గా మలచడానికి కారణాలుగా చూడొచ్చని ఇషాన్‌ తెలిపాడు. ఇషాన్‌ టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనూ తొలి బంతిని బౌండరీకి చేర్చడం విశేషం.

అలాగే ఈ మ్యాచ్‌తో తన కలలు సాకారమవడం ప్రారంభమైందని ఇషాన్‌ ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.‘‘నా కలలు సాకారమవుతున్నాయి. ఇంతకంటే మంచి అనుభూతులు ఉండవు. భారత జట్టు జెర్సీ ధరించడం ఓ పెద్ద గౌరవం. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. దేశం కోసం కష్టపడి పనిచేయాలన్న నా లక్ష్యం కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఇషాన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఆదివారం భారత యువ జట్టు ఘనంగా ఆరంభించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6×4, 1×6), పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9×4), ఇషాన్‌ కిషన్‌ (59; 42 బంతుల్లో 8×4, 2×6) మెరవడంతో ఆదివారం తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. లక్ష్యాన్ని భారత్‌ 36.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మొదట శ్రీలంక 9  వికెట్లకు 262 పరుగులు చేసింది. పృథ్వీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టాడు. వన్డే క్రికెట్‌లో ఎదుర్కొన్న తొలి బంతిని (ధనంజయ బౌలింగ్‌) ముందుకొచ్చి స్టాండ్స్‌లోకి కొట్టిన అతడు..  తర్వాతి బంతిని బౌండరీకి తరలించాడు. ధనంజయ తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు దంచాడు. తర్వాత కూడా కిషన్‌ దూకుడు కొనసాగించడంతో భారత్‌ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts