ఔరా ఇషాంత్‌! త్రిశతకం చేసేశాడు

టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్‌గా, మూడో పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ సరసన నిలిచాడు....

Published : 08 Feb 2021 18:39 IST

కపిల్‌, జహీర్‌ సరసన చేరిన మూడో పేసర్‌

చెన్నై: టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్‌గా, మూడో పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ సరసన నిలిచాడు.

చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డాన్‌ లారెన్స్‌ను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు. ఓ చక్కని బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 300వ వికెట్‌ సాధించాడు. ఇందుకోసం అతడు 98 మ్యాచులు ఆడటం గమనార్హం. అతడి కన్నా ముందు అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌ దేవ్‌ (434), రవిచంద్రన్‌ అశ్విన్‌ (377; ఈ మ్యాచుకు ముందు), హర్భజన్‌ సింగ్‌ (417), జహీర్ ఖాన్‌ (311) త్రిశతక మైలురాయిని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఇషాంత్‌కు బీసీసీఐ, ఐసీసీ అభినందనలు తెలియజేసింది. ‘ఇషాంత్‌ శర్మకు అభినందనలు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్‌గా‌ అతడు రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ మూడో వికెట్‌ లారెన్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి ఈ ఘనత సాధించాడు’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ‘కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ తర్వాత 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్‌గా ఇషాంత్‌ నిలిచాడు. గొప్ప విజయమిది’ అని ఐసీసీ ట్వీటింది.

బంగ్లాదేశ్‌పై 2007లో అరంగేట్రం చేసిన ఇషాంత్‌ ఇప్పటి వరకు 11 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఒక మ్యాచులో పది వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్లుగా అతడు టీమ్‌ఇండియాకు సేవలు అందిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడి బౌలింగ్‌లో పస తగ్గడంతో మళ్లీ వైవిధ్యం పెంచుకొని కీలకంగా మారాడు.

ఇషాంత్‌ యువకుడిగా ఉన్నప్పుడు ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌కు వేసిన బౌలింగ్‌ స్పెల్‌ గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు. లంబూ 98 మ్యాచుల్లో ఈ ఘనత సాధిస్తే అశ్విన్‌ 54, కుంబ్లే 66, హర్భజన్‌ 72, కపిల్‌ 83, జహీర్‌ 89 మ్యాచుల్లో సాధించారు.

ఇవీ చదవండి
కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు కొడతాడు
ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం పంత్‌ ముందడుగు

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని