Umran - Ishant: బ్యాటర్లు భయపడేలా.. ఇంకా వేగం పెంచు : ఉమ్రాన్‌కు ఇషాంత్ సలహా

పరుగులు భారీగా సమర్పిస్తుండటంతో టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్ ఉమ్రాన్‌ మాలిక్ (Umran Malik)కు అవకాశాలు తగ్గిపోయాయి. స్క్వాడ్‌లో ఉంటున్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నాడు. 

Updated : 21 Mar 2023 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో భీకరమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసే బౌలర్లు అరుదుగా ఉంటారు. ఇటీవల టీమ్‌ఇండియాకి దొరికిన పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik). నిలకడగా 145-150 కి.మీ వేగంతో బంతులను సంధిస్తాడు. అయితే అతడికి ఇటీవల పెద్దగా అవకాశాలు రావడం లేదు. వేగంగా బంతులేస్తున్నప్పటికీ.. పరుగులను నియంత్రించడంలో మాత్రం విఫలం కావడంతో తుది జట్టులోకి రాలేకపోతున్నాడు. అయితే, పరుగులు ఇస్తున్నా స్పీడ్‌ను మాత్రం తగ్గించొద్దని ఉమ్రాన్‌కు మాజీ పేసర్లు షోయబ్‌ అక్తర్, డేల్‌ స్టెయిన్‌ సూచించారు. భారత్‌ సీనియర్‌ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) కూడా ఇలానే స్పందించాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కంటే పేస్‌పైనే దృష్టిపెట్టాలని సూచించాడు.

‘‘బంతిని ఎక్కడ సంధిస్తున్నాడనే దానిపై ఉమ్రాన్ మాలిక్ ఆందోళన చెందకూడదు. అనుభవం గడిచే కొద్దీ అతడికే అర్థమవుతుంది. ఒకవేళ 150 లేదా 160 కి.మీ వేగంతో వేస్తుంటే.. అలానే కొనసాగించాలి. దానిపైనే దృష్టిపెట్టాలి. పరుగులు ఇచ్చేస్తున్నాననే ఆందోళన దరిచేరకూడదు. బ్యాటర్లు భయంతో కళ్లు మూసుకోకపోతే అంత వేగంగా బౌలింగ్‌ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? అందుకే, అతడిని సరైన దారిలో ఉంచి ఆత్మవిశ్వాసం నింపాలి. బ్యాటర్లు నీ బంతిని చూడటానికి కూడా భయపడేలా ఇంకా వేగంగా సంధించాలని చెప్పాలి’’ అని ఇషాంత్ శర్మ తెలిపాడు. తన రికార్డును ఉమ్రాన్‌ అధిగమిస్తే సంతోషిస్తానని, అవసరమైతే సలహాలు ఇవ్వడానికి సిద్ధమని పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ ఎకానమీ వన్డేల్లో కంటే టీ20ల్లో దారుణంగా ఉంది. వన్డే ఫార్మాట్‌లో 6.45 ఉంటే.. టీ20ల్లో మాత్రం 10 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు