
WTC Final: గాయపడ్డ ఇషాంత్.. వేలికి కుట్లు
టెస్టు సిరీస్ లోపు కోలుకుంటాడన్న బీసీసీఐ వర్గాలు
సౌథాంప్టన్: టీమ్ఇండియాకు షాక్! సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతడి కుడిచేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలవ్వడంతో కుట్లు వేశారు. ఇంగ్లాండ్ టెస్టు సిరీసు లోపు అతడు కోలుకుంటాడని జట్టు వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్ గాయపడ్డాడు. తన బౌలింగ్‌లోనే ఓ బంతిని ఆపేందుకు అతడు డైవ్ చేశాడు. దాంతో చేతివేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఈ మ్యాచులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
‘ఇషాంత్ కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్లకు కుట్లు పడ్డాయి. మరీ తీవ్రమైన గాయాలేమీ కావు! పది రోజుల్లో కుట్లు మానిపోతాయి. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అప్పట్లోగా అతడు పూర్తిగా కోలుకుంటాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
20 రోజుల విరామం
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగియడంతో టీమిండియాకు విరామం లభించనుంది. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్‌లో విహరించొచ్చు. గురువారం సాయంత్రమే ఆటగాళ్లంతా కలిసి సౌథాంప్టన్ నుంచి లండన్ బయల్దేరారు.
‘జట్టు సభ్యులంతా కలిసే లండన్ వెళ్తారు. ఇప్పట్నుంచి 20 రోజుల వరకు బ్రిటన్‌లో వారు విహరించొచ్చు. తమకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లొచ్చు. జట్టులో కొందరికి టెన్నిస్ అంటే ఇష్టం. అభిమానులకు అనుమతి లభిస్తే వింబుల్డన్ మ్యాచులకు వారు వెళ్లొచ్చు. ఇంకొందరు యూరో గేమ్స్‌కు టికెట్ల కోసం ప్రయత్నించొచ్చు. విహారం ముగిశాక జులై 14 వారంత లండన్‌లో ఒక్కచోటకు చేరుకుంటారు. అక్కడ్నుంచి తొలి టెస్టు జరిగే నాటింగ్హామ్కు వస్తారు’ అని ఆ బీసీసీఐ అధికారి వెల్లడించారు.