WTC Finals: బాలాజీ ఓటు ఇషాంత్‌కే!

న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళానికి ఇషాంత్‌ నాయకత్వం వహించాలని లక్ష్మీపతి బాలాజీ..........

Published : 24 May 2021 23:59 IST

చెన్నై: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళానికి ఇషాంత్‌ నాయకత్వం వహించాలని లక్ష్మీపతి బాలాజీ సూచించాడు. అతడికి తోడుగా బుమ్రా, షమి బౌలింగ్‌ దాడి చేయాలని సూచించాడు. సుదీర్ఘ సిరీసులో బుమ్రాకు విశ్రాంతినిస్తే సిరాజ్‌ను ఆడించాలని పేర్కొన్నాడు. నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌లో బాలాజీ చెన్నై సూపర్‌కింగ్స్‌కు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

‘నేనైతే ఇషాంత్‌, బుమ్రా, షమిని టాప్-3 బౌలర్లుగా ఎంపిక చేస్తా. ప్రతిభావంతులు చాలామంది ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధం ఉంటుంది. ఇంగ్లాండ్‌ పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో చూడాలి. గతంలో ఇషాంత్‌ అక్కడ రాణించాడు. ఇంగ్లిష్‌ కౌంటీ అనుభవమూ అతడి సొంతం. బౌలింగ్‌ దళానికి అతడే నాయకత్వం వహించాలి. లంబూ రక్షణాత్మకంగా బంతులేస్తే షమి, బుమ్రా దూకుడుగా దాడి చేస్తుంటారు. పరిస్థితులు నియంత్రణలో లేనప్పుడు నేనైతే  ఇషాంత్‌తోనే బౌలింగ్‌ చేయిస్తా. అతడు పరిస్థితిని చక్కదిద్దగలడు’ అని బాలాజీ అన్నాడు.

‘బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలంటే అతడితో సారూప్యత గల బౌలర్‌కే చోటివ్వాలి. ఎందుకంటే పేసుగుర్రం ఒక మ్యాచ్‌ విజేత. అత్యంత ప్రతిభావంతుడు. అతడికి ప్రత్యామ్నాయంగా సిరాజ్‌ ఉన్నాడు. వీరిద్దరూ బంతులు వేసే విధానం ఒకేలా ఉంటుంది. ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్‌, వికెట్ల వెనకాల క్యాచులు ఇచ్చే బంతుల్ని ఒకేలా వేస్తారు. సిరాజ్‌ కొద్దిగా భిన్నం. బుమ్రా లేకున్నా దాడి చేసేందుకు అవసరమైన ప్రణాళిక రచించి బౌలర్లు కెప్టెన్‌కు అండగా నిలవాలి. బుమ్రా, షమి లేకున్నా భారత బౌలర్లు 20 వికెట్లు తీయగలరు’ అని బాలాజీ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని