
ఎప్పటికీ మహీ ‘3’ రికార్డు బద్దలవ్వదు: గౌతీ
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభినందించారు. ఎందరు కెప్టెన్లు వచ్చినా ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన ఘనతను ఎవరూ చెరపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ రికార్డు ఎప్పటికీ అతడి పేరుతోనే నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో గౌతీ మాట్లాడారు.
‘ఎంఎస్ ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మరే కెప్టెన్ ఐనా ఈ ఘనతను సాధిస్తారని అనుకోను. దీనిమీద నేను పందెం కాస్తాను. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం సాధారణ విషయం కాదు. శతకాలు ఎప్పటికైనా బద్దలవుతాయి. మరెవరో వచ్చి రోహిత్ శర్మ కన్నా ఎక్కువ ద్విశతకాలు బాదేయొచ్చు. భారత్ నుంచి మరే కెప్టెన్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తాడని అనుకోను. ఎప్పటికీ మహీ పేరుతోనే ఈ ఘనత ఉంటుంది!’ అని గౌతీ అన్నారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్ తర్వాత మహీ మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి వీడ్కోలుపై ఎన్నో వదంతులు వచ్చాయి. వాటికి సాక్షీసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రి, మాజీ ప్రధాన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడతాడని మహీ అభిమానులు ఆశించారు. కరోనా వైరస్ ముప్పుతో ఆ టోర్నీ వాయిదా పడింది. ఐపీఎల్ సైతం మార్చిలో కాకుండా సెప్టెంబర్‌లో యూఏఈలో ఆరంభం అవుతోంది. రెండేళ్లుగా అతడి ప్రదర్శనలో దూకుడు లేకపోయినప్పటికీ వీడ్కోలు తర్వాత రెచ్చిపోతాడని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.