Jasprit Bumrah: బుమ్రాను ఆడటం అందుకే కష్టం

విచిత్రమైన బౌలింగ్‌ శైలి కలిగిన జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ వంటి పేసర్లను ఎదుర్కోవడం కష్టమని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. వారి బంతులు ఎలా వస్తాయో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కావని అన్నారు.

Published : 03 Jun 2021 01:23 IST

మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌

ముంబయి: విచిత్రమైన బౌలింగ్‌ శైలి కలిగిన జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ వంటి పేసర్లను ఎదుర్కోవడం కష్టమని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. వారి బంతులు ఎలా వస్తాయో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కావని అన్నారు. ప్రస్తుతం క్రికెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఆఫ్‌ కట్టర్లు, ఆఫ్‌ కట్టర్‌ బౌన్సర్‌, నకుల్‌ బాల్‌, వైవిధ్యమైన యార్కర్లు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు.

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాడో అందరికీ తెలిసిందే. అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ జంకుతున్నారు. విచిత్రమైన శైలి కావడం.. రన్నప్‌ తక్కువగా ఉండటం.. యాంగిల్‌ భిన్నంగా ఉండటంతో ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమవ్వదు. ఇక అతడి యార్కర్లు అత్యంత కచ్చితత్వంతో ఉంటాయి. సైడ్‌ఆర్మ్‌ బౌలింగ్‌తో లసిత్‌ మలింగ అద్భుతాలెన్నో చేయడం మనం చూశాం.

‘బుమ్రా పూర్తిగా భిన్నమైన బౌలర్‌. ఎందుకంటే అతడి బౌలింగ్‌ శైలి సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అతడు లసిత్‌ మలింగ తరహా బౌలర్‌. బుమ్రా ఒకవైపు నుంచే బౌలింగ్‌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మలింగకు వ్యతిరేకంగా ఉంటాడు. అలాంటి బౌలర్లను ఆడటం సులువు కాదు. వాళ్ల బంతులు నేరుగా పిచ్‌ అవుతాయా? స్వింగ్‌ చేస్తారా? అర్థంకాక బ్యాట్స్‌మన్‌ తికమక పడతారు. అందుకే వారు విజయవంతం అయ్యారు. బుమ్రా భిన్నమైన శైలే అతడికెంతో ఉపయోగపడుతోంది. అందులో చాలా వైవిధ్యం ఉంటుంది’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు.

పేస్‌ బౌలింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని వెంకటేశ్‌ తెలిపారు. టెస్టుల్లో వేగంగా పరుగులు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే టీ20ల్లో వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారని ప్రశంసించారు. బ్యాక్‌ ఆఫ్ ది హ్యాండ్‌, ఆఫ్‌ కట్టర్‌, ఆఫ్‌ కట్టర్‌ బౌన్సర్‌, నకుల్‌ బాల్‌ వంటివి వచ్చాయన్నారు. యార్కర్లలోనే ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని