Virat Kohli-Saurabh Netravalkar: తొలి బంతికే విరాట్ వికెట్.. అదొక భావోద్వేగ క్షణం: సౌరభ్‌ నేత్రవల్కర్

విరాట్ కోహ్లీని తొలి బంతికే ఔట్ చేసిన సౌరభ్‌ నేత్రవల్కర్ పేరు మార్మోగిపోయింది. భారత్‌ చేతిలో యూఎస్‌ఏ ఓడిపోయినప్పటికీ అతడి ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది.

Published : 14 Jun 2024 15:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ తరఫున అండర్-19 క్రికెట్ ఆడిన పేసర్ సౌరభ్‌ నేత్రవల్కర్ (Saurabh Netravalkar) ఇప్పుడు అమెరికాలో ఫేమస్. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) యూఎస్‌ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు పాక్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌పైనా రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీని (Virat Kohli) తొలి బంతికే ఔట్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. మరొక ఓవర్‌లో కెప్టెన్ రోహిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. కోహ్లీని గోల్డెన్‌ డక్ చేయడంపై సౌరభ్‌ స్పందించాడు. ఇవాళ ఐర్లాండ్‌తో యూఎస్‌ఏ గ్రూప్‌ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈక్రమంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడాడు.

‘‘ఇద్దరు స్టార్లను ఔట్ చేయడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా సంతోషాన్ని మాటల్లోనూ వర్ణించలేకపోతున్నా. యూఎస్‌ఏ గత రెండు మ్యాచుల్లో టాప్‌ జట్లతో తలపడింది. విరాట్ కోహ్లీ వికెట్‌ తీయడం మాత్రం జీవితంలో మరిచిపోలేను. తొలి బంతికే ఔట్ చేయడం నాకొక భావోద్వేగ క్షణం. ఆఫ్‌ స్టంప్‌నకు అవతల బంతిని విసిరి ఫలితం రాబడదామని ప్రయత్నించా. అందుకు తగ్గట్టుగానే వికెట్ దక్కడం ఆనందంగా ఉంది. సూర్యకుమార్‌ యాదవ్ నాకు అండర్-15 నుంచి తెలుసు. మేమిద్దరం కలిసి ఆడాం. విరాట్ నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ, మ్యాచ్‌ అనంతరం నన్ను అభినందించాడు’’ అని సౌరభ్‌ తెలిపాడు. 

ఫ్లోరిడాకు చేరిన భారత ఆటగాళ్లు

జూన్ 15న (శనివారం) కెనడాతో భారత్‌ గ్రూప్ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌ ఆడనుంది. దీనికి వేదిక ఫ్లోరిడా. దీంతో న్యూయార్క్‌ నుంచి భారత ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. అయితే, భారీ వర్షాలు పడుతుండటంతో మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. టీమ్‌ఇండియా ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దైంది. మరోవైపు ఇవాళ ఇదే మైదానంలో యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్‌ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ రద్దైతే మాత్రం యూఎస్‌ఏ ‘సూపర్-8’ దశకు చేరుకుంటుంది. అప్పుడు పాక్‌ ఇంటిముఖం పడుతుంది. దీంతో తన చివరి మ్యాచ్‌ (జూన్ 16న) నామమాత్రమే కానుంది. ఒకవేళ యూఎస్‌ఏ ఓడిపోయి.. పాక్‌ గెలిస్తే ఎవరు మెరుగైన రన్‌రేట్‌ను కలిగిఉంటారో వారికి ‘సూపర్-8’ అవకాశం దక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు