ఆ విజయం ప్రపంచకప్‌తో సమానం: ఇషాంత్

టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకోనున్నాడు. కపిల్‌దేవ్‌ తర్వాత 100 టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన భారత పేసర్‌గా నిలవడానికి మరో మ్యాచ్ దూరంలో...

Published : 23 Feb 2021 00:54 IST

ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకోనున్నాడు. కపిల్‌దేవ్‌ తర్వాత 100 టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన భారత పేసర్‌గా నిలవడానికి మరో మ్యాచ్ దూరంలో ఉన్నాడు. బుధవారం జరగనున్న ఇంగ్లాండ్‌తో జరిగే డే/నైట్ టెస్టులో లంబూ ఈ ఘనత సాధించడం దాదాపు ఖరారే. అయితే తానెప్పుడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడనని, జట్టు విజయాల కోసమే పోరాడతానని అన్నాడు.

భారత కెప్టెన్లందరూ తనని గొప్పగా అర్థంచేసుకున్నారని పేర్కొన్నాడు. సారథి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుంటే బౌలర్‌గా తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలిపాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడలేకపోవడం వల్ల సుదీర్ఘ ఫార్మాట్లలో త్వరగా మైలురాళ్లను సాధిస్తున్నానన్నాడు. దాని అర్థం పరిమిత ఓవర్లపై ఆసక్తి లేనట్లు కాదని అన్నాడు. సమయం దొరకడంతో తన ఆటపై మరింత శ్రద్ధ వహించానని చెప్పాడు. 99 టెస్టుల్లో ఇషాంత్ 302 వికెట్లు సాధించిన విషయం తెలిసిందే.

కపిల్‌దేవ్‌ 131 టెస్టుల రికార్డును అధిగమించాలనే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టంతా టెస్టు ఛాంపియన్‌షిప్‌పైనే ఉందని ఇషాంత్ శర్మ తెలిపాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజయం తనకి ప్రపంచకప్‌తో సమానమని చెప్పాడు. వయసు పెరిగే కొద్ది ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాలంటే దానికి తగ్గట్లుగా శరీరాన్ని సన్నద్ధం చేసుకోవాలని వెల్లడించాడు. గాయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నానని అన్నాడు. భారత జట్టుకు ఎంపికయ్యే ప్రతి బౌలర్‌ గొప్ప సామర్థ్యం ఉన్న ఆటగాడేనన్నాడు. అయితే బుమ్రా సమర్థవంతంగా పేస్ దళాన్ని నడిపిస్తాడని ఇషాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే యువపేసర్లను ప్రోత్సహిస్తూ రాణించాలని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని