Euro cup final: యూరో కప్‌ ఛాంపియన్‌గా ఇటలీ

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇటలీ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్‌ను మరోసారి ముద్దాడింది. గత

Updated : 12 Jul 2021 06:31 IST

 ఇంగ్లాండ్‌ను ఓడించి రెండో సారి కప్పును ముద్దాడిన ఇటలీ

(PHOTO: UEFA Twitter నుంచి) 

లండన్‌: యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇటలీ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్‌ను మరోసారి ముద్దాడింది. గత కొన్నేళ్లుగా మెగా టోర్నీలో విఫలమవుతున్న ఇటలీకి ఈ విజయంతో సాంత్వన లభించినట్టైంది. లండన్‌ వేదికగా అభిమానులు కిక్కిరిసిన వెంబ్లే స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దాసి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ ఇక పెనాల్టీ షూటౌట్‌కు మారింది. ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్‌ చేయగా, ఇంగ్లాండ్‌ రెండింటిని మాత్రమే గోల్‌గా మలిచింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చి కప్పు కొడుదామన్న ఇంగ్లాండ్‌ ఆశలు ఆవిరయ్యాయి. 

ఇక ఆటలో తొలి గోల్‌ ఇంగ్లాండే చేసినప్పటికీ ఆధిపత్యమంతా ఇటలీదే. ఆట ప్రారంభమైన 2వ నిమిషానికే ఇంగ్లాండ్‌ ఆటగాడు లూక్‌ షా గోల్‌చేశాడు. యూరో కప్‌ ఫైనల్‌ చరిత్రలో మ్యాచ్‌ ప్రారంభమైన 2 నిమిషాలకే గోల్‌ నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఇంగ్లాండ్‌ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఆ ఆధిక్యాన్ని తొలి అర్ధభాగం ముగిసే సమయం వరకు అలాగే కాపాడుకుంది. ఇక 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. దీంతో ఆధిపత్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత, అదనపు సమయంలో కూడా ఇరు జట్లు 1-1తో నిలిచాయి. ఇక పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌కీపర్‌ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీని విజయతీరాలకు చేర్చాడు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని